Share News

Chandrababu-Visakha: విశాఖను మోస్ట్ లివబుల్ సిటీగా తీర్చిదిద్దుతున్నాం: చంద్రబాబు

ABN , Publish Date - Nov 13 , 2025 | 08:15 PM

ప్రజల నివాసానికి, జీవన వికాసానికి అత్యంత ప్రముఖమైన నగరంగా సాగరనగరం విశాఖను తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ముంబై, వారణాసి, సూరత్, విశాఖల అభివృద్ధికి కేంద్రం సరికొత్త విజన్ తెచ్చిందని..

Chandrababu-Visakha: విశాఖను మోస్ట్ లివబుల్ సిటీగా తీర్చిదిద్దుతున్నాం: చంద్రబాబు
Chandrababu-Visakha

విశాఖపట్నం, నవంబర్ 13: విశాఖను మోస్ట్ లివబుల్(Most Liveable City) సిటీగా తీర్చిదిద్దుతున్నామని.. ప్రధాని మోదీ కూడా ఏపీ అభివృద్ధికి సహకరిస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. 2038 నాటికి భారత్ రెండో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారుతుందన్నారు. భారతదేశం 2047కి ప్రపంచంలోనే అగ్రస్థానంలోకి రావటాన్ని ఎవరూ ఆపలేరని కూడా చంద్రబాబు తెలిపారు.


రాష్ట్ర అభివృద్ధి కోసమే ఓ విజన్ తయారు చేసుకుని అమలు చేస్తున్నామని, దేశంలోని నాలుగు నగరాలకు విజన్ తయారు చేయాలని కేంద్రం నిర్దేశించిందని చంద్రబాబు చెప్పారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ముంబై, వారణాసి, సూరత్, విశాఖల అభివృద్ధికి ఈ సరికొత్త విజన్ అమలు చేయాలని కేంద్రం నిర్ణయించిందని చంద్రబాబు అన్నారు.


అక్షర క్రమంలో, అభివృద్ధి పోటీలో ఏపీనే ఎప్పుడూ ముందుంటుందని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. 'సాగర తీరాన ఉన్న విశాఖ నగరం దేశంలోనే అత్యంత సుందరమైన ప్రాంతం. గత పాలకులు రాష్ట్రాన్ని.. దాని అభివృద్ధిని సర్వనాశనం చేశారు. అందుకే కూటమిగా ప్రజల మద్దతుతో పునర్నిర్మాణం చేస్తున్నాం. రూ.2.66 లక్షల కోట్ల ఎంఓయూలు సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ కంటే ముందే చేశాం. 17 నెలల్లోనే రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు తేగలుగుతున్నాం.' అని చంద్రబాబు అన్నారు.


'గూగుల్ డేటా సెంటర్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో వస్తోంది. అనకాపల్లిలో దాదాపు రూ.1 లక్ష కోట్లతో స్టీల్ ప్లాంట్ రాబోతోంది. 9 జిల్లాలతో ఏర్పాటు చేస్తున్న విశాఖ ఎకనామిక్ రీజియన్ భవిష్యత్‌ ఆర్థిక శక్తిగా ఏపీని నిర్దేశించే ఓ మోడల్. ఈ ఎకనామిక్ రీజన్ సీఈఓ గా.. ఇండస్ట్రీ సెక్రెటరీ యువరాజు వ్యవహరిస్తారు. విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్, సుస్థిర అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం. విశాఖ ఎకనామిక్ రీజియన్ అథారిటీకి చైర్మన్ హోదాలో నేనే స్వయంగా అభివృద్ధిని పర్యవేక్షిస్తాను.' అని చంద్రబాబు అన్నారు.


ఇవీ చదవండి:

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. డీఎన్ఏ అతడిదే..

Terror Accused Shaheen: అలా చేసిందంటే నమ్మశక్యంగా లేదు: షాహీన్ కుటుంబం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 13 , 2025 | 08:20 PM