CP Radhakrishnan: ఇదే సరైన సమయం.. రండి పెట్టుబడులు పెట్టండి: ఉపరాష్ట్రపతి
ABN , Publish Date - Nov 14 , 2025 | 01:51 PM
విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సు విజయవంతం కావాలని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. సుపరిపాలన, అత్యుత్తమ విధానాలనే ఏపీలో కూటమి ప్రభుత్వం ఆచరిస్తోందని తెలిపారు.
విశాఖపట్నం, నవంబర్ 14: 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ప్రధాని మోడీ నేతృత్వంలో ఆర్థికంగా సుసంపన్నమైన దేశంగా భారత్ ఎదుగుతోందన్నారు. సంపద సృష్టిస్తేనే ప్రపంచంలో పేదరిక నిర్మూలన సాధ్యం అవుతుందన్నారు. ఏపీలో సుపరిపాలన, అత్యుత్తమ విధానాలనే సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఆచరిస్తోందని తెలిపారు. అభివృద్ధికి - సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు రోల్ మోడల్ అని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దారన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీని అభివృద్ధి చేయడానికి అంతే శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు సాధించడానికి చంద్రబాబు.. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఒప్పిస్తున్నారన్నారు. విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. దేశం, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేస్తున్నాయన్నారు. జీఎస్టీ సంస్కరణలు, మౌలిక సదుపాయాల కల్పన వంటివి దేశాభివృద్ధి దోహదం చేస్తున్నాయని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, బ్లూ, అగ్రి ఎకనామి ఇలా వేర్వేరు రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఏపీలో ఉన్నాయని ఉపరాష్ట్రపతి వెల్లడించారు.
ఇ-గవర్నెన్సు, డిజిటల్ ఇన్ ఫ్రా ద్వారా వేగంగా సేవలు అందుతున్నాయన్నారు. టెక్నాలజీ నాలెడ్జి డ్రివెన్ ఎకానమీ సాధించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని తెలిపారు. దేశంలోనూ, ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం అంటూ ఉపరాష్ట్రపతి అందరికీ పిలుపునిచ్చారు. వచ్చే రెండు మూడేళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందన్నారు. అలాగే అతిపెద్ద స్టార్టప్ ఎకో సిస్టంగానూ భారత్ ఎదుగుతుందని పేర్కొన్నారు. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనతో ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తామన్నారు. ప్రతీ దేశంతోనూ భారత్ మైత్రినే కోరుకుంటుందని.. అంతా కలిసి ఎదుగుదాం అనే భావన భారతదేశానిది అని అన్నారు. ఇతరులకు నష్టం కలిగించటం కాదు, ప్రయోజనం కల్పించటం ద్వారా అభివృద్ధి సాధించాలనేది భారత్ నినాదమని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
అతిథులకు ఆహ్వానం పలుకుతూ సీఎం ట్వీట్
చిన్నారులకు చంద్రబాబు, పవన్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు
Read Latest AP News And Telugu News