Childrens Day Wishes: చిన్నారులకు చంద్రబాబు, పవన్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు
ABN , Publish Date - Nov 14 , 2025 | 10:57 AM
చిన్నారులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారులు బాగా చదవుకుని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు.
అమరావతి, నవంబర్ 14: జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. చిన్నారుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేసేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని సీఎం అన్నారు. కల్మషం లేని మనసులు చిన్నారులకే సొంతమని.. నైతిక విలువలతో కూడిన విద్యను అందించడం తప్పనిసరి అని ఉపముఖ్యమంత్రి పవన్ వెల్లడించారు.
చంద్రబాబు ట్వీట్..
‘జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికీ శుభాకాంక్షలు. రేపటి తరాన్ని అన్నివిధాలా శక్తివంతంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దడం కోసం... వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. బాలలకు చదువు చెప్పిస్తే అది వారి పరిపూర్ణ వికాసానికి దోహదం చేస్తుంది. అందుకే తల్లికి వందనం పథకం ద్వారా పిల్లలందర్నీ బడికి పంపించేలా ప్రోత్సహిస్తున్నాము. మధ్యాహ్న భోజన పథకంలో కూడా పిల్లలకు ఇష్టమైన మెనూ ఉండేలా చూస్తున్నాం. అలాగే పిల్లల పథకాలకు స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెట్టాం. ప్రభుత్వ ఆశయాన్ని అర్థం చేసుకుని బాలలందరూ బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ మరోసారి చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఆ బాధ్యత మాది: పవన్
చిన్నారులందరికీ డిప్యూటీ సీఎం పవన్ జాతీయ బాల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కల్మషం లేని మనసులు చిన్నారులకే సొంతమన్నారు. మంచి ఆలోచనలు పెంపొందేలా బాలల చుట్టూ ఆరోగ్యకర వాతావరణం ఉండాలని తెలిపారు. పాఠశాల స్థాయి నుంచి వారికి మనో వికాసం కలిగేలా స్వేచ్ఛాయుతమైన, ఆహ్లాదకరమైన పరిస్థితులు తీసుకురావాలని అన్నారు. నైతిక విలువలతో కూడిన విద్యను అందించడం తప్పనిసరి అని చెప్పుకొచ్చారు. మన దేశ సంస్కృతి సంప్రదాయాల విలువలు తెలియచెప్పాలని.. అప్పుడే భవిష్యత్ పౌరులు సామాజిక బాధ్యత కలిగినవారై, దేశ భక్తిపూరితంగా మనో నిబ్బరంగా ఉంటారన్నారు. . ఈ బాధ్యతను కూటమి ప్రభుత్వం చేపడుతుంది అని డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఓఎంసీ సుప్రీం కమిటీ నుంచి అనంత కలెక్టర్ తొలగింపు
అతిథులకు ఆహ్వానం పలుకుతూ సీఎం ట్వీట్
Read Latest AP News And Telugu News