AP Bus Accident: బస్సు ప్రమాదంపై వెంటనే సహాయక చర్యలు చేపట్టాం: కలెక్టర్ దినేష్ కుమార్
ABN , Publish Date - Dec 12 , 2025 | 08:38 AM
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్‌లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా..20మందికి తీవ్ర గాయాలయ్యాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా, డిసెంబరు12(ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్‌లో ఇవాళ(శుక్రవారం) తెల్లవారు జామున బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా.. 20మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ బస్సు ప్రమాదంపై ఎప్పటికప్పుడు అధికారులతో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు కలెక్టర్ దినేశ్ కుమార్.
అన్నవరం నుంచి అరకు మీదుగా భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఇవాళ(శుక్రవారం) తెల్లవారు జామున ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. బస్సులో ఉన్న వారిలో ఇప్పటివరకు 10 మంది చనిపోయారని తెలిపారు. మొత్తం 22 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని వివరించారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పుకొచ్చారు.
ఈ బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఒక ఆరుగురు వరకు చిన్న గాయాలతో సురక్షితంగానే ఉన్నారని వివరించారు. అక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్‌తో పాటు యంత్రాంగం.. అప్రమత్తమై వెంటనే సహాయక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
కాగా, ఈ ప్రమాదానికి కారణమైన బస్సు చిత్తూరుకు చెందిన ఏవీఎం ట్రాన్స్‌పోర్టుకి చెందినదిగా తెలుస్తోంది. బస్సు ఓనర్ ఏకే రామ్మూర్తి మురుకంబట్టు ప్రాంతానికి చెందిన వాసి. టూర్ ఏజెంట్ వజ్రం అనే వ్యక్తి ద్వారా ఏడు రోజుల పాటు టూరుకు బస్సును బుక్ చేసకున్నారు. ఈనెల ఆరోతేదీన చిత్తూరు నుంచి ఈ బస్సు బయలుదేరింది.