CM Chandrababu Anakapalli: స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముందుండి నడిపించేది వారే: చంద్రబాబు
ABN , Publish Date - Dec 20 , 2025 | 04:14 PM
స్వచ్ఛాంధ్రలో అనకాపల్లి 13వ స్థానంలో ఉందని.. ఇంకా మెరుగుపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముందుండి నడిపించేది గ్రీన్ సోల్జర్లని.. వారికి అభివాదాలు తెలియజేశారు.
అనకాపల్లి, డిసెంబర్ 20: జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా తాళ్ళపాలెంలో స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం సమయంలో ప్రధాని తనకో బాధ్యతను అప్పగించినట్లు చెప్పారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో సమగ్ర చర్చ జరిపి నిర్వహణ అప్పగించారన్నారు. ఏ కార్యక్రమం అయినా ప్రజల భాగస్వామ్యంతోనే విజయాలు సాధించగలమని చెప్పుకొచ్చారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముందుండి నడిపించేది గ్రీన్ సోల్జర్లని.. వారికి అభివాదాలు తెలియజేశారు సీఎం.
రీసైకిల్ ఏకానమి సృష్టించామని.. అందరి ఆరోగ్యం కోసం ఈ పని చేస్తున్నట్లు తెలిపారు. సాలిడ్ వేస్ట్ ను కంపోస్ట్ యూరియాగా మారుస్తున్నారని దీని వల్ల రైతులకు దిగుబడి పెరుగుతోందన్నారు. పారిశుద్ధ్య కార్మికులే నిజమైన సైనికులని చెప్పుకొచ్చారు. 2029 నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 86 మెట్రిక్ టన్నుల చెత్త ఉంచి పోయిందని.. అక్టోబర్ 2 నాటికి ఆ చెత్త తొలగించామని తెలిపారు. ఫిబ్రవరి 15 నాటికి ప్రతీ ఇంటి నుంచి చెత్త కలెక్ట్ చేసే ప్రక్రియ 100 శాతం పూర్తి చేస్తామని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో కిచెన్ గార్డెన్స్‌కు రూ.5లక్షలు సాయం అందిస్తామన్నారు చంద్రబాబు. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌తో రోజు వెయ్యి టన్నుల చెత్త సేకరించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని చెప్పారు. అక్టోబర్ 2 తర్వాత రాష్ట్రంలో సింగల్ యూస్ ప్లాస్టిక్ ఉండకూడదన్నారు. ఏ ఆఫీస్‌కు వెళ్లకుండా మొబైల్ ద్వారానే సేవలు పొందే అవకాశం తెస్తున్నామని చెప్పారు. 'నాది ఉడుంపట్టు.. వదిలి పెట్టేది లేదు' అని తేల్చి చెప్పారు. స్వచ్ఛాంధ్రలో అనకాపల్లి 13వ స్థానంలో ఉందన్న సీఎం.. ఇంకా మెరుగుపడాలని సూచించారు.
అనకాపల్లి పరిశ్రమల హబ్‌గా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. జిల్లాలో మొదటి ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ ను 90 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అరకు కాఫీ కోసం ఆనంద్ మహేంద్ర ట్వీట్ చేశారని పేర్కొన్నారు. అనకాపల్లిలో ఆర్గానిక్ బెల్లం చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేలా ముందుకెళ్లాలని సూచించారు. రెండు నెలల్లో పోలవరం నీళ్లు అనకాపల్లికి వస్తాయన్నారు. గోదావరి నీళ్లు వంశధారకు అనుసంధానం చేస్తామని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి పూర్వోదయ కింద కేంద్రాన్ని సహాయం కోరినట్లు చెప్పారు.
ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూస్తోందన్నారు సీఎం. త్వరలో అనకాపల్లి జిల్లాలో ఆర్సీలార్ మిట్టల్‌తో స్టీల్ సిటీ ఏర్పడుతుందని వెల్లడించారు. అల్యూమినియం సిటీ కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. మెడికల్ కాలేజ్‌లకు పీపీపీ కింద ఇచ్చామన్న సీఎం.. గతంలోనూ 104, 108లు ప్రైవేట్‌కే ఇచ్చారు కదా? ప్రశ్నించారు. రుషికొండను గుండు కొట్టారని విమర్శించారు. రుషికొండకు రూ.500 కోట్లు ఖర్చు చేశారని.. ఆ సొమ్ములతో మెడికల్ కాలేజ్ కట్టొచ్చన్నారు. వైసీపీ హయాంలో ఏజెన్సీని గంజాయి వనంగా మారిస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చి కాఫీవనంగా మార్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
‘ముస్తాబు’ ఓ మంచి కార్యక్రమం: సీఎం చంద్రబాబు
పొరపాట్లు జరిగితే సరిదిద్దుకుంటాం: మంత్రి నాదెండ్ల
Read Latest AP News And Telugu News