Share News

Nadendla Manohar: పొరపాట్లు జరిగితే సరిదిద్దుకుంటాం: మంత్రి నాదెండ్ల

ABN , Publish Date - Dec 20 , 2025 | 03:44 PM

రికార్డు స్థాయిలో కృష్ణా జిల్లాలో మొట్టమొదటిసారి 11 ట్రైన్లు పెట్టి ధాన్యం ఇతర జిల్లాలకు తరలించారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కృష్ణా జిల్లాలో పర్యటించిన మంత్రి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Nadendla Manohar: పొరపాట్లు జరిగితే సరిదిద్దుకుంటాం: మంత్రి నాదెండ్ల
Nadendla Manohar

కృష్ణా, డిసెంబర్ 20: జిల్లాలోని తోట్లవల్లూరు మండలంలో మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) ఈరోజు (శనివారం) పర్యటించారు. పామర్రు ఎమ్మెల్యే కుమార్ రాజాతో కలిసి తోట్లవల్లూరు గ్రామంలోని రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోత కోసి కుప్ప నూర్పుడి చేస్తున్న రైతులు.... కల్లాల్లో ధాన్యం ఆరబోసిన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతు సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామని తెలిపారు. రైతుకు మేలు జరగాలని కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. పొరపాట్లు జరిగితే సరిదిద్దుకుంటామని.. అవి పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి వరకు 28లక్షల34 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని తెలిపారు.


సంక్రాంతి కల్లా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎప్పటికప్పుడు రైతాంగ సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తున్నామన్నారు. రికార్డు స్థాయిలో కృష్ణా జిల్లాలో మొట్టమొదటిసారి 11 ట్రైన్లు పెట్టి ధాన్యం ఇతర జిల్లాలకు తరలించారని తెలిపారు. జిల్లాలో మిల్లుల సామర్థ్యం తక్కువగా ఉండడంతో రాష్ట్రంలో 106 మిల్లుల నిర్వాహకులు కృష్ణాజిల్లాలో ధాన్యం కొనుగోలు చేసేలా వేసులుబాటు కల్పించామని చెప్పారు.


భారీ ఎత్తున జరిగిన ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని రైతాంగాన్ని వివరించాలని ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ధాన్యం రైతులు ప్రభుత్వానికి అమ్మితే కనీస మద్దతు ధర తప్పక అందుతుందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలులో రైతుకు సహాయంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని అన్నారు. 24 గంటల్లోపే విక్రయించిన ధాన్యం నగదును రైతు ఖాతాలో జమ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఇకపై అన్ని స్కూళ్లల్లో ‘ముస్తాబు’.. సర్కార్ ఉత్తర్వులు జారీ

‘ముస్తాబు’ ఓ మంచి కార్యక్రమం: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 20 , 2025 | 04:08 PM