Pemmasani Chandrasekhar: ప్రైవేట్ కొరియర్ సర్వీసులకు ధీటుగా పోస్టాఫీసులు: కేంద్రమంత్రి
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:12 PM
సాంకేతికత సాయంతో ప్రైవేట్ కొరియర్ సర్వీసులకు ధీటుగా పోస్టాఫీసులను తయారు చేస్తున్నామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విట్ వర్సిటీలో జెన్ జెడ్ పోస్టాఫీసును కేంద్రమంత్రి ప్రారంభించారు.
అమరావతి, డిసెంబర్ 20: రైల్వే తర్వాత అత్యధికంగా పోస్టల్ శాఖలో 4.50 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Union Minister Pemmasani Chandrasekhar) అన్నారు. శనివారం నాడు విట్ యూనివర్సిటీలో జెన్ జెడ్ ( Gen Z) పోస్టాఫీసును కేంద్రమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. పోస్టల్ శాఖ ఉద్యోగులందరినీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే దేశంలోనే పటిష్టమైన శాఖగా పోస్టల్ డిపార్ట్‌మెంట్ నిలుస్తుందన్నారు. లేటెస్ట్ టెక్నాలజీ రావడం వల్ల ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో సులభంగా తెలుస్తోందని తెలిపారు.
కేవలం లెటర్స్ బట్వాడాకే పరిమితం కాకుండా ఈ కామర్స్ ప్లాట్ ఫాంగా మార్చామని చెప్పారు. ప్రతి ఉద్యోగి తమ విధులు సజావుగా నిర్వహించేలా చూస్తున్నామన్నారు. సాంకేతికత సాయంతో ప్రైవేట్ కొరియర్ సర్వీసులకు ధీటుగా పోస్టాఫీసులను తయారు చేస్తున్నామని తెలిపారు. మానవ వనరులను సక్రమంగా వాడుకోవడంపై దృష్టి సారించామని అన్నారు. జెన్ జెడ్ పోస్టాఫీసు ఏర్పాటు లక్ష్యం యువతను ప్రభుత్వ వ్యవస్థలో భాగస్వామ్యులను చేయడమే అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో మూడు జెన్ జెడ్ పోస్టాఫీసులు ఏర్పాటు చేశామని.. దేశ వ్యాప్తంగా దాదాపు 50 జెన్ జెడ్ పోస్టాఫీసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోస్టల్ శాఖలో పెట్టే ఖర్చులతో 89 శాతం జీతాలకు సరిపోతున్నాయన్నారు. సామాజిక బాధ్యతగా చేసే కార్యక్రమాల వల్ల తాము ఎక్కువ ఛార్జీలు వసూలు చేయటం లేదని.. అందుకే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు ఆలోచిస్తున్నామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా, పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం..ఆదుకోండి!
శ్రీశైలంలో ఇలాంటివి చేయొద్దు.. చర్యలు తప్పవు.. ఈవో కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News