YSRCP Leaders: శబరి యాత్రలో జగన్ జపం... అయ్యప్ప భక్తుల ఆగ్రహం
ABN , Publish Date - Nov 29 , 2025 | 09:44 AM
విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గానికి చెందిన అయ్యప్ప స్వాములు శబరిమలకు వెళ్తూ జగన్ ఫోటోలు ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. శబరి యాత్రలో రాజకీయ నేతల ఫోటోలపై అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖపట్నం, నవంబర్ 29: అయ్యప్ప మాలను భక్తులు ఎంతో పరమ పవిత్రంగా ధరించి.. భక్తి భావంలో మునిగిపోతారు. మాలధారణలో ఆ మణికంఠుడి ధ్యాస తప్ప వేరే ఆలోచనలకు చోటు ఇవ్వరు. ఎంతో శ్రద్ధ, నిష్టతో అయ్యప్పను పూజిస్తారు. 41 రోజుల పాటు అయ్యప్ప స్వామి పూజను చేసి ఆ తరువాత ఇరుముడి కట్టుకుని శబరిమలకు స్వాములు పయనమవుతారు. శబరిమల యాత్రలో కూడా అయ్యప్ప భజన చేస్తూ.. స్వామిని స్మరించుకుంటూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. కానీ ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించారు ఏపీలోని పలువురు స్వాములు.
వైసీపీకి చెందిన పలువురు నేతలు అయ్యప్ప మాల ధరించి శబరి యాత్రకు పయనమయ్యారు. అయితే శబరి యాత్రలో జగన్ జపం చేస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. శబరిమలకు వెళ్తూ జగన్, ఇతర నేతల బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు. జగన్ 2.0 అని రాసి ఉన్న బ్యానర్‌ను ప్రదర్శించడమే కాకుండా జై జగన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇటీవల అనకాపల్లికి చెందిన వైసీపీ నేతలు జగన్ బ్యానర్‌తో శబరి యాత్ర చేయగా.. తాజాగా విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన వైసీపీ నేతలు జగన్ జపంలో మునిగిపోయారు.
పెందుర్తి నియోజకవర్గం వైసీపీకి చెందిన అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలకు వెళ్తూ జగన్ బ్యానర్లు ప్రదర్శించారు. జగన్ ఫోటోతో పాటు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైసీపీ నేతల ఫోటోలతో కూడిన బ్యానర్లు ప్రదర్శించారు. మొత్తం మూడు ఫ్లెక్సీలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. ఈ వీడియోలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైసీపీ నేతల ఓవరాక్షన్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయ్యప్ప స్వామి ఇరుముడి పట్టుకుంటూ ఇలా రాజకీయ నేతల ఫోటోల ప్రదర్శనపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. శబరిమలకు వెళ్తున్నప్పుడు రాజకీయ నేతలు ఫోటోలతో ప్రదర్శన ఏమిటి అంటూ అయ్యప్ప స్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట చెందిన వైసీపీకి చెందిన అయ్యప్ప స్వాములు కూడా ఇలానే జగన్ రెడ్డి బ్యానర్లు పట్టుకొని ప్రదర్శించారు. అంతే కాకుండా జై జగన్ నినాదాలు చేశారు. ఈ ఘటన మరువక ముందే మళ్లీ ఇలాంటిదే చోటు చేసుకోవడంతో హిందూ సంఘాలు, అయ్యప్ప స్వామి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇటువంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని అయ్యప్ప భక్తులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇండియావైపు దూసుకొస్తున్న 'దిత్వా'.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.!
నెల్లూరు పెంచలయ్య హత్య కేసులో నిందితులపై పోలీస్ కాల్పులు
Read Latest AP News And Telugu News