Ditwah Cyclone: ఇండియావైపు దూసుకొస్తున్న 'దిత్వా'.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.!
ABN , Publish Date - Nov 29 , 2025 | 09:15 AM
దిత్వా తుపాన్ భారత్‌వైపునకు దూసుకొస్తోంది. ఆదివారం తెల్లవారుజాము నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముంది. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో మత్స్యకారులు, రైతులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.
అమరావతి, నవంబర్ 29: శ్రీలంకలో బీభత్సం సృష్టిస్తోన్న 'దిత్వా' భారత్‌వైపుగా దూసుకొస్తోంది(Ditwah Cyclone). ప్రస్తుతం.. భారత్‌లోని కారైకాల్(Karaikal)కు 220 కి.మీ., పుదుచ్చేరి(Puducherry)కి 330 కి.మీ., చెన్నై(Chennai)కి 430 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన ఆరు గంటల్లో సుమారు 7 కి.మీ. వేగంతో కదిలిన ఈ తుపాన్.. ఆదివారం తెల్లవారుజాము నాటికి తీవ్ర వాయుగుండంగా మారి తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా(ఏపీ) తీరాలకు చేరే అవకాశముంది.
దీని ప్రభావంతో శనివారం.. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ స్థాయిలో వానలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో మంగళవారం వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యల నిమిత్తం ఎన్డీఆర్ఎఫ్(SDRF), ఎస్డీఆర్ఎఫ్(NDRF) బృందాలు సిద్ధంగా ఉన్నాయి.
దిత్వా.. ఆదివారం వరకు తీవ్ర తుపానుగా తీవ్రత కొనసాగించి.. రాత్రి సమయానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశమున్నట్టు భారత వాతావరణ విభాగం(IMD) వెల్లడించింది. అనంతరం.. సోమవారం చెన్నైకి దగ్గరగా వెళ్లి, తర్వాత తీరం వెంట ప్రయాణించి సముద్రంలో బలహీనపడొచ్చని ప్రాథమికంగా నిర్ధారించింది ఐఎండీ.
ఇవీ చదవండి: