Cabinet Approves Land Pooling: 7 గ్రామాలు.. 16,666 ఎకరాలు
ABN , Publish Date - Nov 29 , 2025 | 05:29 AM
అమరావతి రాజధాని నిర్మాణానికి రెండో విడత భూసమీకరణకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి విడతలో 34వేల ఎకరాలు సేకరించిన సీఆర్‌డీఏ తాజాగా మరో...
జరీబు భూమికి నివాస స్థలం 1,000 గజాలు, వాణిజ్య ప్లాటు 450 గజాలు
మెట్ట భూములకు నివాస స్థలం 1,000 గజాలు, వాణిజ్య ప్లాటు 250 గజాలు
అమరావతిలో రెండో విడత భూసమీకరణకు క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్
వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడిల్లో 7,562 ఎకరాలు
వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమిలో 9,104 ఎకరాలు.. త్వరలో నోటిఫికేషన్
భూములిచ్చిన రైతులకు గత నిబంధనలే
అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని నిర్మాణానికి రెండో విడత భూసమీకరణకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి విడతలో 34వేల ఎకరాలు సేకరించిన సీఆర్‌డీఏ తాజాగా మరో 16,666.56 ఎకరాలు సేకరించేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో అమరావతి కోసం రైతుల నుంచి 50వేల ఎకరాలు సేకరించినట్లవుతుంది. మొదటి విడత భూసమీకరణలో 28,526 మంది రైతుల నుంచి 34,400 ఎకరాలు సేకరించారు. మొదటి దశలో సీఆర్‌డీఏకు ప్రభుత్వ భూమి సుమారు 16వేల ఎకరాలు అప్పగించారు. దీంతో మొత్తం ప్రభుత్వ భూమి, రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమితో కలిపి 74వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టనున్నారు. రెండో విడతకు సంబంధించి ఏడు గ్రామాల్లో రైతుల నుంచి భూమిని సమీకరించనున్నారు. దీనికి సంబంధించి సీఆర్‌డీఏ త్వరలో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
రాజధాని అభివృద్ధి కోసమే: నారాయణ
రాజధాని ప్రాంతంలో రైల్వేస్టేషన్, రైల్వే లైన్, స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం మరోసారి భూసమీకరణకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాజధాని విస్తరణ కోసం మలివిడత భూసమీకరణకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీనికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రెండో విడతలో 7 గ్రామాల్లో 16,666.56 ఎకరాలు సమీకరించాలని నిర్ణయించాం. రాజధానిలో వచ్చే 30 ఏళ్లకు సరిపడా ప్రజల జీవన స్థితి ఉండేలా కార్యాచరణ రూపొందించాం. ఈ ప్రాంతంలో భూమి రేట్లు పెరగాలన్నా, వృద్ధి రేటు పెరగాలన్నా.. కచ్చితంగా స్మార్ట్ ఇండస్ర్టీస్ రావాలి. అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం లేకపోతే అభివృద్ధి చెందదు. అందుకే 500 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు కట్టాలని సీఎం నిర్ణయించారు. వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడిల్లో 7,562 ఎకరాలు, వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమిలో 9,104.57 ఎకరాలు సమీకరించాల్సి ఉంది. ఈ గ్రామాల్లో ప్రభుత్వ భూమి 3,828 ఎకరాలు ఉంది.
అయితే ప్రభుత్వ భూముల్లో ఎక్కువగా కొండలు, నీళ్లు ఉన్నాయి. భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు గతంలో అమలు చేసిన నిబంధనలే వర్తిస్తాయి. జరీబు భూమికి నివాస స్థలం 1,000 గజాలు, వాణిజ్య ప్లాటు 450 గజాలు, మెట్ట భూములకు నివాస స్థలం 1,000 గజాలు, వాణిజ్య ప్లాటు 250 గజాలు కేటాయిస్తాం. కౌలు కూడా గతంలో మాదిరిగానే ఇస్తాం. ఇప్పటికే ఈ ఏడు గ్రామాల్లో సభలు నిర్వహించి, భూ సమీకరణకు అనుకూలంగా చేసిన తీర్మానాలను కేబినెట్ ఆమోదించింది. గతంలో స్పోర్ట్స్ సిటీకి 70 ఎకరాలు మాత్రమే కేటాయించగా, ఒలింపిక్ వంటి అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు 2,500 ఎకరాలు అవసరమవుతుంది. గతంలో భూములిచ్చిన రైతులందరికీ ప్లాట్లు ఇచ్చాం. కొన్నిచోట్ల జరీబు, నాన్ జరీబు, గ్రామ కంఠాల వంటి సమస్యలు ప్రస్తావిస్తున్న రైతులతో చర్చిస్తున్నాం. ఎవరికైనా ఎక్కువ భూమి ఇచ్చి ఉంటే వెనక్కి తీసుకోవాలని సీఎం చెప్పారు. ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే నెల రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తాం. అసైన్డ్ రైతుల సమస్యను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తుంది. రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ర్టేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది’ అని మంత్రి వివరించారు.
రాజధానికి 7,500 కోట్ల రుణానికి ఆమోదం
అమరావతి కోసం రూ.7,500 కోట్ల రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవల్‌పమెంట్ (ఎన్‌ఏబీఎ్‌ఫఐడీ) నుంచి రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
AP Cabinet Approves Key Decisions: అవి ప్రభుత్వ వైద్య కళాశాలలే
Amaravati Financial District Laid Foundation: అమరావతిలో.. ఆర్థిక నగరం