AP Council Heated Debate: ఎమ్మెల్సీ నాగబాబు ప్రశ్నకు వైసీపీ వాకౌట్..
ABN , Publish Date - Sep 23 , 2025 | 01:07 PM
గత ప్రభుత్వం తనపైన కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడితే కడప కోర్టుకు హాజరయ్యానని అనిత ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, అంగన్ వాడీలు, ఆశావర్కర్లు సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తే కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: 2019-24 మధ్య కాలంలో తప్పుడు క్రిమినల్ కేసుల పరిష్కారంపై శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు అడిగిన ప్రశ్నకు హోం మంత్రి వంగలపూడి అనిత సమాధానం ఇచ్చారు. ఈ మేరకు వంగలపూడి అనిత ఇచ్చిన సమాధానాన్ని నిరసిస్తూ మండలి నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. గత ప్రభుత్వం చాలా మందిపై అక్రమ కేసులు పెట్టిందని అనిత ఆరోపించారు. అమరావతి రైతులు రాజధాని కోరుకుంటే వందలాది మందిపై కేసులు పెట్టారని మండిపడ్డారు.
నాపై కూడా కేసులు పెట్టారు..
గత ప్రభుత్వం తనపైన కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడితే కడప కోర్టుకు హాజరయ్యానని అనిత ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, అంగన్ వాడీలు, ఆశావర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తే కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులపై 3116 అక్రమ కేసులు పెట్టారని పేర్కొన్నారు. చాలా మంది విద్యార్థులపై రాజకీయ కక్ష సాధింపు కోసం కేసులు పెడితే వారికి ఉద్యోగాలు రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులను త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
కేసులను పరిష్కరిస్తున్నాం..
కేసుల పరిష్కారం కోసం పోలీసు, లా డిపార్టుమెంట్ సమన్వయంతో పనిచేస్తున్నాయని హోం మంత్రి అనిత చెప్పారు. చీకటి జీవోలు తెచ్చే సంస్కృతి కూటమి ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. రికార్డులు, లా ప్రకారం కేసులు పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. సీపీఎస్ రద్దు కోరుతూ టీచర్లు చేసిన ఆందోళనలో.. నమోదైనా కేసులలో ఇప్పటి వరకు 80 శాతం కేసులను ఎత్తివేశామని తెలిపారు. మిగిలిన కేసులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అనిత స్పష్టం చేశారు.
వైసీపీ వాకౌట్..
హోం మంత్రి అనిత చేసిన వ్యాఖ్యలను విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఖండించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలలైనా తప్పుడు కేసులు ఎందుకు పరిష్కరించలేదని ఆయన ప్రశ్నించారు. ప్రజా హితం కాకుండా రాజకీయ కోణంలో హోం మంత్రి సమాధానం చెబుతున్నారని ఆరోపించారు. హోం మంత్రి అనిత చెప్పిన సమాధానానికి నిరసనగా వైసీపీ వాకౌట్ చేస్తున్నట్లు బొత్స ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ
ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు