CM Chandrababu: జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక భేటీ..
ABN , Publish Date - Oct 28 , 2025 | 10:07 AM
ఇప్పటికే జిల్లాల సరిహద్దుల మార్పుపై వచ్చిన ప్రజా అభిప్రాయాలు, ప్రతిపాదనలు సేకరణ పూర్తయినట్లు సమాచారం. ఇప్పుడు వాటిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజనపై ఇవాళ(మంగళవారం) క్యాబినెట్ సబ్ కమిటీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ సబ్ డివిజన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం మ.12 గంటలకు రాష్ట్రంలో మొంథా తుఫాన్ పరిస్థితిపై అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.
జిల్లాల పునర్విభజన కోసం ప్రభుత్వం గతంలో ఏడుగురు మంత్రులతో కూడిన ఓ ప్రత్యేక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే జిల్లాల సరిహద్దుల మార్పుపై వచ్చిన ప్రజా అభిప్రాయాలు, ప్రతిపాదనలు సేకరణ పూర్తయినట్లు సమాచారం. ఇప్పుడు వాటిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థలు, గ్రామస్థాయి వార్డుల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలను స్వీకరించింది. మొత్తం 200లకు పైగా అర్జీలు కమిటీ దృష్టికి వచ్చినట్లు తెలిపింది.
కాగా, వీటన్నింటినీ సమగ్రంగా పరిశీలించిన కమిటీ వివిధ జిల్లాల్లోని కలెక్టర్లు, RDOలు, తహసీల్దార్ల అభిప్రాయాలను కూడా సేకరించింది. ఈ మేరకు సమావేశంలో సూచనలు, ప్రతిపాదనలు, ప్రస్తుత భౌగోళిక పరిస్థితులు, రవాణా సౌకర్యాలు, జనాభా పంపిణీ వంటి అంశాలన్నింటిని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తారు. ప్రధానంగా ఆరు కొత్త జిల్లాల ఏర్పాటుపై ఉపసంఘం ముఖ్యమంత్రి చంద్రబాబుకి నివేదించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే.. ఏపీలోని 26 జిల్లాలు కాస్త 32 జిల్లాలుగా మారనున్నాయి. అయితే ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారో.. అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి..
Election Commission Announced: తమిళనాడు, బెంగాల్లో ఎస్ఐఆర్
Money View App: 3 గంటల్లో 49 కోట్లు కొట్టేశారు..!