Election Commission Announced: తమిళనాడు, బెంగాల్‌లో ఎస్‌ఐఆర్
ABN , Publish Date - Oct 28 , 2025 | 03:51 AM
దేశవ్యాప్తంగా రెండో దశ ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్‌ఐఆర్‌ను చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. వచ్చే ఏడాది...
మరో 10 రాష్ట్రాలు/యూటీల్లో కూడా.. 4 నుంచి రెండో దశ ఓటర్ల జాబితా సవరణ
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ వెల్లడి
న్యూఢిల్లీ, అక్టోబరు 27: దేశవ్యాప్తంగా రెండో దశ ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)’ను చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమబెంగాల్ సహా 12 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతా(యూటీ)ల్లో ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపింది. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. తొలిదశలో బిహార్‌లో ఎస్‌ఐఆర్‌ను విజయవంతంగా పూర్తిచేశామన్నారు. నవంబరు 4 నుంచి డిసెంబరు 4 వరకు రెండో దశ ఎస్‌ఐఆర్ చేపడుతున్నట్లు తెలిపారు. డిసెంబరు 9న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తామన్నారు. తుది ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 7న ప్రచురిస్తామని వెల్లడించారు. రెండో దశలో అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, ఛత్తీ్‌సగఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో ఎస్‌ఐఆర్ చేపడుతున్నట్లు చెప్పారు. ఈ దశలో 51 కోట్ల మంది ఓటర్లు ఈ సవరణ పరిధిలోకి వస్తారన్నారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్‌తో పాటు పుదుచ్చేరి, కేరళలో 2026లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా మోదీకి వ్యతిరేకంగా బలమైన గళం వినిపిస్తున్న మమత, స్టాలిన్‌లు పాలిస్తున్న బెంగాల్, తమిళనాడుల్లో ఎస్‌ఐఆర్‌ను చేపట్టాలని నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. అయితే, అర్హులంతా ఓటరు జాబితాలో ఉండేలా చూడడం, అనర్హులందరినీ తొలగించడమే ఎస్‌ఐఆర్ లక్ష్యమని సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ చెప్పారు. 1951 నుంచి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 8 సార్లు నిర్వహించారన్నారు. తాజాగా చేపట్టనున్న ఎస్‌ఐఆర్ కోసం అధికారులకు మంగళవారం నుంచి శిక్షణ ప్రారంభించనున్నట్లు తెలిపారు. బెంగాల్ ప్రభుత్వంతో తమకెలాంటి గొడవా లేదని, రాజ్యాంగబద్ధంగా తాము విధులు నిర్వర్తిస్తున్నామని చెప్పారు. కేరళలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలన్న డిమాండ్లపై స్పందిస్తూ.. అక్కడ ఇంకా స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. కాగా, అసోంలో కూడా 2026లోనే ఎన్నికలు ఉన్నాయి. అయితే, అక్కడ ఎస్‌ఐఆర్‌పై విడిగా ప్రకటన చేస్తామని సీఈసీ చెప్పారు. ‘‘పౌరసత్వ చట్టం కింద అసోంలో పౌరసత్వానికి సంబంధించి ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పౌరసత్వ గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కావాల్సి ఉంది’’ అని జ్ఞానేశ్ తెలిపారు. రెండో దశ ఎస్‌ఐఆర్ ప్రకటనపై కాంగ్రెస్ స్పందించింది.
ఈసీ ఇప్పుడు 12 రాష్ట్రాల్లో ఓట్ల చోరీకి సిద్ధమవుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా ధ్వజమెత్తారు. మరోవైపు, ‘సర్’లో ఓటరు గుర్తింపునకు 12 పత్రాలను పేర్కొనగా అందులో ఆధార్ కూడా ఉంది. వీటితో పాటుగా బిహార్‌లో ‘సర్’ అనంతరం ప్రచురించిన ఓటరు జాబితాను కూడా గుర్తింపు పత్రంగా ఎన్నికల సంఘం పేర్కొంది. ఒకవేళ ఎవరైనా ఈ 12 రాష్ట్రాల్లోని ఒకదాంట్లో ఓటరుగా నమోదు చేసుకోవాలని అనుకుంటే, అలాంటి వారి తల్లిదండ్రుల పేర్లు బిహార్ తాజా ఓటరు జాబితాలో ఉంటే దానిని అసలైన ధ్రుపవత్రంగా పరిగణిస్తారు. అలాంటి వారు పౌరసత్వ నిరూపణ కోసం కేవలం జననధ్రువపత్రాన్ని సమర్పిస్తే సరిపోతుంది.
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కుట్ర: స్టాలిన్
ఎస్‌ఐఆర్ చేపట్టాలన్న ఈసీ నిర్ణయాన్ని ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా తమిళనాడు సీఎం స్టాలిన్ అభివర్ణించారు. బీజేపీకి సాయం చేసేందుకు ఈసీ పౌరుల హక్కులను దోచుకుంటోందని ఆరోపించారు. బిహార్‌లో పెద్ద సంఖ్యలో మహిళలు, మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీల ఓట్లను తొలగించివేశారని విమర్శించారు. వచ్చే నెల 2న చెన్నైలో అఖిలపక్షం ఏర్పాటు చేసి, ఈసీ నిర్ణయంపై తదుపరి కార్యాచరణ గురించి చర్చిస్తామన్నారు. ఓటు హక్కును కాలరాసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా తమిళనాడు పోరాడి గెలుస్తుందని స్టాలిన్ చెప్పారు.