Money View App: 3 గంటల్లో 49 కోట్లు కొట్టేశారు..!
ABN , Publish Date - Oct 28 , 2025 | 03:49 AM
వ్యక్తిగత రుణాలు అందించే ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థకు చెందిన యాప్‌నకే సైబర్ నేరగాళ్లు మస్కా కొట్టారు. యాప్‌నకు చెందిన అప్లికేషన్ ప్రోగ్రామింగ్...
మనీ వ్యూ యాప్‌పై సైబర్ ముఠా పంజా
ఏపీఐ సిస్టమ్‌లోకి చొరబడి కోట్లు బదిలీ
ఇద్దరిని అరెస్టు చేసిన బెంగళూరు సీసీబీ పోలీసులు
బెంగళూరు, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): వ్యక్తిగత రుణాలు అందించే ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థకు చెందిన యాప్‌నకే సైబర్ నేరగాళ్లు మస్కా కొట్టారు. యాప్‌నకు చెందిన అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేజ్ (ఏపీఐ) సిస్టమ్‌లోకి చొరబడి.. 3 గంటల వ్యవధిలో రూ.49 కోట్ల మేర కొల్లగొట్టారు. హ్యాకర్లు ఏపీఐ కీని ఉపయోగించి సొమ్మును నకిలీ ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. ఈ సైబర్ ఘరానా మోసానికి సంబంధించి కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. సీసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విజ్డమ్ అనే ఫైనాన్స్ కంపెనీ ‘మనీవ్యూ’ అనే యాప్‌ను నిర్వహిస్తోంది. ఆ యాప్‌ను దుబాయ్, చైనా, హాంకాంగ్, ఫిలిప్పైన్స్ దేశాల నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా లక్ష్యంగా చేసుకుంది. ఏపీఐ కీని ఉపయోగించి మూడు గంటల వ్యవధిలో రూ.49 కోట్ల మేర సొమ్మును వందలాది నకిలీ ఖాతాలకు బదిలీ చేశారు. దుబాయ్ కేంద్రంగా ఉండే భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని ఈ దాడికి మాస్టర్ మైండ్‌గా గుర్తించారు. ఇతను అక్కడి నుంచి సైబర్ దాడిని సమన్వయం చేశాడు. ఇందు కోసం బెళగావికి చెందిన ఇస్మాయిల్ రషీద్ అత్తార్ అనే వ్యక్తి నుంచి వర్చువల్ ప్రైవేట్ సర్వర్ల (వీపీఎస్) ఒక్కోదాన్ని రూ.2 వేల చొప్పున రెంట్‌కు తీసుకున్నారు. ఆ తర్వాత ఏపీఐ సిస్టమ్‌లోకి చొరబడేందుకు సర్వర్లను ఫ్రాన్స్‌కు చెందిన ఐపీ అడ్ర్‌సతో లింక్ చేశారని అధికారులు వివరించారు. ఈ సైబర్ దాడికి సంబంధించి ఇస్మాయిల్ రషీద్ అత్తార్‌తో పాటు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన సంజయ్ పటేల్‌ను అరెస్టు చేశారు. వారిద్దరి నుంచి ల్యాప్‌టా్‌పలు, పైన్‌డ్రైవ్‌లు సీజ్ చేశారు. అలాగే నకిలీ ఖాతాల్లోకి బదిలీ అయిన రూ.10 కోట్ల మేర అధికారులు ఫ్రీజ్ చేశారు. ఈ గ్యాంగ్‌కు సంబంధించి దుబాయ్‌లో ముగ్గురు, హాంకాంగ్‌లో ఇద్దరు అనుమానితులను గుర్తించారు. వీరిని పట్టుకొనేందుకు అంతర్జాతీయ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నట్లు సీసీబీ పోలీసులు తెలిపారు.