IMD Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
ABN , Publish Date - Sep 24 , 2025 | 06:07 PM
ఉత్తర ఒడిశా, వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్ గంగా పరివాహక ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే ఐదురోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
విశాఖపట్నం: ఉత్తర ఒడిశా, వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్ గంగా పరివాహక ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం మరింతగా ప్రభావం చూపనుంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ 25న ఉత్తర మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది 26న బలపడుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం 27వ తేదీన దక్షిణ ఒడిశా – ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం మధ్య ప్రాంతాన్ని దాటే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
పశ్చిమ బెంగాల్ ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకూ ద్రోణి విస్తరించి ఉంది. ఈ ద్రోణి ప్రభావంతో రాబోయే ఐదురోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తాలోని పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం వెంబడి బలమైన ఈశాన్య గాలులు వీచే అవకాశముందని తెలిపింది. తీర ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తక్కువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ పరికరాల వాడకంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Also Read:
నీట్‌లో 99.99 శాతం మార్కులు కానీ.. డాక్టర్ అవ్వాలని లేదని..
బీసీ రిజర్వేషన్లపై పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు
For More Latest News