Share News

TTD : తిరుమలలో బ్రాండెడ్‌ హోటళ్లు!

ABN , Publish Date - Feb 03 , 2025 | 04:15 AM

టీటీడీ సిద్ధమవుతోంది. జాతీయస్థాయిలో పేరొందిన బ్రాండెడ్‌ సంస్థలకు హోటళ్ల లైసెన్సులు జారీచేయాలని భావిస్తోంది.

TTD : తిరుమలలో బ్రాండెడ్‌ హోటళ్లు!

  • లైసెన్సులు జారీచేసే యోచనలో టీటీడీ

  • త్వరలోనే కొత్త పాలసీ అమలుకు సిద్ధం

తిరుమల, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): తిరుమలలో శ్రీవారి భక్తులకు హోటళ్లలో నాణ్యమైన ఆహారాన్ని అందించే దిశగా కొత్త పాలసీ అమలుకు టీటీడీ సిద్ధమవుతోంది. జాతీయస్థాయిలో పేరొందిన బ్రాండెడ్‌ సంస్థలకు హోటళ్ల లైసెన్సులు జారీచేయాలని భావిస్తోంది. తిరుమలలో 10 పెద్ద క్యాంటీన్లు, 6 జనతా క్యాంటీన్లు ఉన్నాయి. వీటిని గతంలో టెండర్ల విధానంలో టీటీడీ కేటాయించేది. భారీగా అద్దె చెల్లించేందుకు ముందుకు వచ్చేవారికి లైసెన్సు జారీ చేసేది. అయితే ఆహారపదార్థాల ధరల్లో నిబంధనలు లేకపోవడంతో భక్తుల నుంచి నిత్యం ఫిర్యాదులొచ్చేవి. ఈ క్రమంలో జనతా హోటళ్లకు మాత్రం నిర్ణీత అద్దెను ముందుగానే నిర్ణయించి డిప్‌ విధానం ద్వారా లైసెన్సులు కేటాయిస్తూ వస్తున్నారు. ఇకపై పెద్ద క్యాంటీన్ల(రెస్టారెంట్లు)కు కూడా ఇదే తరహాలో లైసెన్సులు జారీ చేయాలని తాజాగా నిర్ణయించారు. రెస్టారెంట్లలో ఆహారపదార్థాల నాణ్యత, ధరల విషయంలో వస్తున్న విమర్శలకు పుల్‌స్టాప్‌ పెట్టనున్నారు. హోటళ్ల నిర్వహణ రంగంలో అనుభవం కలిగిన నిపుణులు, ఫుడ్‌ సేఫ్టీ విభాగం అధికారులతో టీటీడీ ఇటీవల పలు సమావేశాలు నిర్వహించింది. లైసెన్సుల కేటాయింపులో కొత్త పాలసీని తీసుకురావాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.


లైసెన్సు కాలపరిమితి మూడేళ్లు కావడంతో సరైన వసతులు కల్పించడం లేదని గుర్తించారు. కొంతమంది ఒక పేరుపై లైసెన్స్‌ పొంది మరొకరికి సబ్‌లీజుకు ఇస్తున్నారు. తమ సంస్థ పేరు కాకుండా మరొకపేరు పెట్టుకుని హోటళ్లను నడుపుతున్నారు. కొత్త పాలసీలో ఈ లోపాలనూ సరిదిద్దనున్నారు. రెస్టారెంట్లను టెండరు ద్వారా కాకుండా నిర్ణీత అద్దెతో డిప్‌ విధానంలో కేటాయించనున్నారు. లైసెన్సు కాల పరిమితి ఐదేళ్లకు పెంచనున్నారు. బ్రాండెడ్‌ సంస్థలకు లైసెన్సు కేటాయిస్తే వాటి ప్రతిష్ఠ దెబ్బతినకుండా నాణ్యమైన ఆహారాన్ని అందిస్తారని టీటీడీ భావిస్తోంది. ఆహార పదార్థాల ధరల నియంత్రణకూ కొన్ని నిబంధనలు తీసుకురానుంది. నాణ్యత తనిఖీకి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రస్తుత లైసెన్స్‌ల కాలపరిమితి ముగిశాక త్వరలోనే కొత్త పాలసీని అమలుకు టీటీడీ ప్రణాళిక రూపొందిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

Drunk Man : ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం...

Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం

Kondapalli Srinivas: అద్భుతం.. అస్సలు ఊహించలేదు.. బడ్జెట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 03 , 2025 | 04:15 AM