Tirumala: ఆలయంలోకి సరుకులు చేర్చేందుకు.. కొత్త ‘బ్యాగ్ కన్వేయర్’..
ABN , Publish Date - Nov 13 , 2025 | 11:13 AM
తిరుమల శ్రీవారి ఆలయంలోకి ముడి సరుకులు చేర్చేందుకు నూతన బ్యాగ్ కన్వేయర్ (బ్యాగ్ స్టాగర్) అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా శ్రీవారికి సమర్పించే అన్నప్రసాదాలు, లడ్డూలు, వడలు, ఇతర ప్రసాదాలన్నీ సంప్రదాయం మేరకు శ్రీవారి ఆలయంలోని పోటు (కట్టెల పొయ్యితో కూడిన వంటశాల)లోనే తయారవుతాయి.
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలోకి ముడి సరుకులు చేర్చేందుకు నూతన బ్యాగ్ కన్వేయర్ (బ్యాగ్ స్టాగర్) అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా శ్రీవారికి సమర్పించే అన్నప్రసాదాలు, లడ్డూలు, వడలు, ఇతర ప్రసాదాలన్నీ సంప్రదాయం మేరకు శ్రీవారి ఆలయంలోని పోటు (కట్టెల పొయ్యితో కూడిన వంటశాల)లోనే తయారవుతాయి. ఈమేరకు నిత్యం దాదాపు 50 టన్నుల నుంచి 65 టన్నుల ముడిసరుకులను ఆలయంలోకి పంపాల్సి ఉంటుంది. మహద్వారం నుంచి ఈ సరుకులను తరలించడం అంటే భక్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.

ఈక్రమంలో 35 ఏళ్లుగా ఆలయం వెనుకభాగంలో ఉన్న ఉగ్రాణం (ముడిసరుకుల నిల్వ ప్రదేశం) నుంచి టీటీడీ బ్యాగ్ కన్వేయర్ ద్వారా సరుకులను ఆలయంలోకి పంపుతున్నారు. అప్పట్లో చెన్నైకి చెందిన ఓ సంస్థ ఈ బ్యాగ్ కన్వేయర్‌ను విరాళంగా అందించింది. ప్రసాదాల తయారీకి కావాల్సిన సరుకులను చిన్నపాటి మూటలు కట్టి ఈ కన్వేయర్‌పై ఉంచితే దాదాపు 40 అడుగల ఎత్తులో ఉన్న ఆలయ ప్రాకారంపైకి చేరుతాయి. అక్కడి సిబ్బంది ఈ సరుకులను తీసుకుని ప్రసాదాల తయారీకి వినియోగిస్తారు. ఇది ప్రతిరోజు జరిగే ప్రక్రియ. అయితే దాదాపు 35 ఏళ్ల క్రితం నుంచి వినియోగిస్తున్న ఈ బ్యాగ్ కన్వేయర్ నిత్యం మరమ్మతులకు గురవుతోంది.

అప్పటికప్పుడు మరమ్మతులు పూర్తిచేసి సిద్దం చేసినప్పటికీ బ్యాగ్ కన్వేయర్ బాడీ పూర్తిగా దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. కన్వేయర్ కింద నిత్యం భక్తులు కూడా రాకపోకలు సాగిస్తున్న క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకూడదనే ముందస్తు జాగ్రత్తగా టీటీడీ(TTD) నూతన బ్యాగ్ కన్వేయర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఓ దాత సహకారంతో నాగ్‌పూర్ నుంచి నూతన బ్యాగ్ కన్వేయర్‌ను తిరుమలకు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఇందులోనే హైడ్రాలిక్, బాడీ వంటి వాటిని పరిశీలన చేస్తున్నారు. రానున్న రెండుమూడు రోజుల్లో దీన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురానున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిమెంట్ రంగంలో రూ 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు
సైబర్ దాడుల నుంచి రక్షణకు టాటా ఏఐజీ సైబర్ ఎడ్జ్
Read Latest Telangana News and National News