Tirupati News: ప్రజాప్రతినిధుల పీఆర్వోలు టికెట్లు అమ్ముకుంటున్నారు..
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:05 PM
తిరుమలలో కొంతమంది ప్రజాప్రతినిధుల పీఆర్వోలు అధిక ధరలకు వీఐపీ బ్రేక్ దర్శనాలను అమ్ముకుంటున్నారని ఈశ్వర్(అనంతపురం) అనే భక్తుడు ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌కు ఫిర్యాదు చేశారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో శుక్రవారం పలువురు భక్తులు ఈవోతో ఫోన్‌లో సంభాషించారు.
- డయల్ యువర్ ఈవోలో భక్తుడి ఫిర్యాదు
తిరుమల: తిరుమలలో కొంతమంది ప్రజాప్రతినిధుల పీఆర్వోలు అధిక ధరలకు వీఐపీ బ్రేక్ దర్శనాలను అమ్ముకుంటున్నారని ఈశ్వర్(అనంతపురం) అనే భక్తుడు ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌కు ఫిర్యాదు చేశారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో శుక్రవారం పలువురు భక్తులు ఈవోతో ఫోన్‌లో సంభాషించారు. ఈ సమయంలో ఈశ్వర్ మాట్లాడుతూ ఒక టికెట్‌ను రూ.5 వేల నుంచి రూ.6 వేలకు అమ్ముతున్నారని చెప్పారు. ఇటువంటి వారిని కట్టడి చేయలని కోరారు. దళారీలపై ఫిర్యాదులు వస్తున్నాయని,విజిలెన్స్ విభాగం చర్యలు తీసుకుంటోందని ఈవో సమాధానం ఇచ్చారు. భక్తులు కూడా దళారీలను ఆశ్రయించకుండా టీటీడీ అధికారిక వెబ్‌సైట్, కౌంటర్ల ద్వారానే టికెట్లు, టోకెన్లు పొందాలని సూచించారు.
డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి 17 మంది భక్తులు ఈవోతో ఫోన్‌లో మాట్లాడారు. దర్శన సమయంలో ఆలయంలోని శ్రీవారిసేవకులు లాగేస్తున్నారని, దర్శన టికెట్ల బుకింగ్ సమయంలో ఓటీపీ ఆలస్యంగా వస్తోందని మణికంఠ(అనంతపురం) ఫిర్యాదు చేశారు. ఓటీపీ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని, అలాగే భక్తులతో మెలిగే విధానంపై శ్రీవారిసేవకులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామని ఈవో బదులిచ్చారు. 2023లో ఇంజినీరింగ్ విభాగంలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చారని,

కానీ ఇప్పటికీ ఎలాంటి నియామకాలు జరగలేదని గణేష్ (కడప) ఈవో దృష్టికి తీసుకురాగా, 15 రోజుల్లోనే ఈ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దివ్యాంగులు, వృద్ధులకు ఆఫ్‌లైన్‌లోనూ టోకెన్లు కేటాయిస్తామని బోర్డు ప్రకటించినప్పటికీ చర్యలు తీసుకోలేదని జగన్(జగిత్యాల) తెలుపగా, భక్తుల అభిప్రాయ సేకరణ, కమిటీ సిఫార్సుల మేరకు త్వరలోనే నిర్ణయాలు తీసుకుంటామని ఈవో అన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వంటి ప్రముఖుల సూచనలను దృష్టిలో పెట్టుకుని వీఐపీలు ఏడాదిలో కొన్నిసార్లు మాత్రమే దర్శనం చేసుకునేలా చూడాలని మునిలక్ష్మీ(తిరుపతి) కోరారు.
బుకింగ్ సమయంలో ఆధార్ అప్‌లోడింగ్ సమస్య
దర్శన టికెట్లు, టోకెన్ల బుకింగ్ సమయంలో ఆధార్ అప్‌లోడ్ చేసేలోపు కోటా పూర్తయిపోతోందని హరిణి అనే భక్తురాలి ఫిర్యాదుపై ఈవో బదులిస్తూ.., బుకింగ్ సమయంలో మళ్లీ ఆధార్ అప్‌లోడ్ చేసే అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పేమెంట్ సమయంలో క్రెడిట్, డెబిట్‌కార్డులు ఉపయోగించే అవసరం లేకుండా ఆర్బీఐ సూచించిన యూపీఐ, వ్యాలెట్ ద్వారా చెల్లించే అంశాలను కూడా ఐటీ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కిసాన్ డ్రోన్.. సాగు ఖర్చు డౌన్
Read Latest Telangana News and National News