MLC Elections: కూటమి కుమ్మేసింది!
ABN , Publish Date - Mar 05 , 2025 | 03:13 AM
వైసీపీ హయాంలో 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం... గత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం...

4 ఉమ్మడి జిల్లాలు.. 67 నియోజక వర్గాల పరిధిలో ‘పట్టభద్ర’ పోలింగ్
‘అసెంబ్లీ’కన్నా పెరిగిన ఓట్ల శాతం
నాడు 58 శాతం ఓటు షేరు.. నేడు 65 శాతానికిపైగా ఓట్లు
పట్టభద్ర స్థానాల్లో అఖండ విజయం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
వైసీపీ హయాంలో 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం... గత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం... ఇప్పుడు జరిగిన రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో అఖండ విజయం! ఇదీ... తెలుగుదేశం పార్టీ, కూటమి విజయ ప్రస్థానం! అధికారం చేపట్టిన 8 నెలలకే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఆకాశాన్నంటుతోందని... వివిధ కారణాల వల్ల విద్యావంతులు గుర్రుగా ఉన్నారని... పట్టభద్ర ఎన్నికల్లో గుణపాఠం చెప్పబోతున్నారని వైసీపీ దుష్ప్రచారమంతా కూటమి అభ్యర్థుల గెలుపు ముందు దూదిపింజలా తేలిపోయింది. వైసీపీ విమర్శలకు పట్టభద్ర ఓటర్లు దీటుగా బదులిచ్చారు. పేరుకు ఇవి రెండు పట్టభద్ర నియోజకవర్గ ఓటర్లు మాత్రమే! కానీ... నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 67 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పట్టభద్ర ఓటర్లు చెప్పిన తీర్పు ఇది! ఇక ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలో టీడీపీ మద్దతు ఇచ్చిన ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరైన పీఆర్టీయూ నేత గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు.
అసాధారణ, అఖండ మెజారిటీలు...
మొదటి ప్రాధాన్య ఓటుతోనే టీడీపీ అభ్యర్థులు రెండు చోట్లా విజయదుందుభి మోగించారు. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 82వేలు... ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖర్ 77వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల నుంచి సుమారు 7 లక్షల మంది ఓటర్లుగా ఉండగా సుమారు 4.60 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇందులో 65 శాతం ఓట్లు కూటమి అభ్యర్థులకే పడ్డాయి. ఆలపాటి రాజా 1,45,057 ఓట్లు సాధించి మొత్తం ఓట్లలో 67.51 శాతం ఓట్లు సాధించారు. పేరాబత్తుల రాజశేఖర్ 1,24,702 ఓట్లు సాధించి మొత్తం ఓట్లలో 62.5 శాతం పైగా ఓట్లు సాధించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి అభ్యర్థులకు 59.28 శాతం ఓట్‌షేర్ రాగా నేడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు షేరు మరింత పెరిగి 62.59 శాతానికి చేరడం గమనార్హం.
నాడు రెండో ప్రాధాన్య ఓటుతో..
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2023లో ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి... ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల స్థానానికి, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మూడుచోట్లా టీడీపీ అభ్యర్థులు రెండో ప్రాధాన్య ఓటుతో విజయాన్ని కైవశం చేసుకున్నారు. అప్పటి ఫలితాలు వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు అద్దం పట్టాయి. నేటి ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాయి. శాసనమండలిలో ఐదు పట్టభద్ర స్థానాలుండగా... తాజా గెలుపుతో ఆ అయిదూ టీడీపీ ఖాతాలో పడ్డాయి. అధికారంలో ఉండగానే ‘పట్టభద్రుల’ చేతిలో వైసీపీ ఘోరంగా దెబ్బతింది. దీంతో... ఇప్పుడు అసలు అభ్యర్థిని నిలిపేందుకు సాహసించలేదు. ఇప్పుడు వైసీపీ ముద్రతో కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానంలో పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు మరింత ఎక్కువ నష్టపోయారు. ఆయనకు వైసీపీ మద్దతు ఇస్తోందనే కారణంతో... ఓటర్లు కూటమికి మద్దతుగా ఓటు వేశారు. ఇక... ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఇచ్చిన యూటీఎఫ్ అభ్యర్థి ఏకంగా మూడో స్థానానికి పడిపోయారు. ఇదీ... వైసీపీకి అటు పట్టభద్రులు, ఇటు ఉపాధ్యాయులు ఇచ్చిన అసలైన ‘మాస్టర్’ స్ట్రోక్!