Kuna Ravi Kumar: అమెరికా నుంచి రాగానే అన్ని చెబుతా
ABN , Publish Date - Aug 17 , 2025 | 09:25 PM
పొందూరు కేజీబీవీ పాఠశాలలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే తనపై ప్రిన్సిపల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆముదాలవలస ఎమ్మెల్యే, టీడీపీ నేత కూన రవికుమార్ స్పష్టం చేశారు.
అమరావతి, ఆగస్టు 17: పొందూరు కేజీబీవీ పాఠశాలలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే తనపై ప్రిన్సిపల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆముదాలవలస ఎమ్మెల్యే, టీడీపీ నేత కూన రవికుమార్ స్పష్టం చేశారు. పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. అయితే పొందూరు ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను వేధిస్తున్నారంటూ పాఠశాల ప్రిన్సిపల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ స్పందించారు. ఆ క్రమంలో ఆదివారం అమరావతిలోని టీడీపీ నేతలతో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడారు.
విద్యార్థినుల అడ్మిషన్లకు అక్రమంగా నగదు వసూలు చేయడం, వారికి ఉపయోగించాల్సిన నిత్యావసర వస్తువులను దారి మళ్లించడం వంటి అంశాలపై ఆమెను ప్రశ్నించానని చెప్పారు. ఆ క్రమంలోనే వైసీపీ నేతలతో కలిసి ప్రిన్సిపల్ తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. “తల్లికి వందనం” కార్యక్రమంపై ముగ్గురు ప్రిన్సిపల్స్‌తో ఒకే సారి తాను వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించానని ఈ సందర్భంగా ఆయన వివరించారు. కానీ కేవలం పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్‌తోనే వీడియో కాల్ చేసినట్లు అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే కూన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేజీబీవీ విద్యార్థినులతో ఇంట్లో పనులు చేయించుకోవడం.. మెగా టీచర్ - పేరెంట్ మీటింగ్ కోసం విద్యార్థినుల నుండి అక్రమంగా నగదు వసూలు చేస్తోందంటూ సదరు ప్రిన్సిపల్‌పై తల్లిదండ్రుల నుంచి తనకు ఫిర్యాదులు అందాయన్నారు. ఆ క్రమంలో ఆ ఫిర్యాదులు ఆధారంగా మాత్రమే ఆమెను తాను ప్రశ్నించానని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి గతంలో ఆమె సస్పెండ్ అయిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాంటి చరిత్ర కలిగిన ఆ ప్రిన్సిపల్‌ను అడ్డు పెట్టుకొని తనపై బురద జల్లేందుకు కుట్ర చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై కూన రవికుమార్ నిప్పులు చెరిగారు. అమెరికా నుండి తిరిగి రాగానే పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తానని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీలోని ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారంపై వచ్చిన ఆరోపణలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ఈ తరహా ఆరోపణలు, విమర్శలు రాకుండా ఉండేలా ఉండాలన్నారు. వీరి వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని పార్టీని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి: సీఎం చంద్రబాబు
బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ
వాయుగుండం.. టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు
For More AP News And Telugu News