Share News

YS Sharmila: ఆ ఉచ్చులో పడకండి.. సీఎం చంద్రబాబుకు కీలక సూచన

ABN , Publish Date - Feb 04 , 2025 | 03:21 PM

YS Sharmila: గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు కులగణన చేపట్టిందని.. కానీ బీజేపీ దత్తపుత్రుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆ సర్వే వివరాలు తొక్కిపెట్టారని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. బీజేపీ డైరెక్షన్‍లోనే సర్వే రిపోర్టు బయటకు పొక్కకుండా కుట్ర చేశారంటూ వైఎస్ జగన్‍పై మండిపడ్డారు.

YS Sharmila: ఆ ఉచ్చులో పడకండి.. సీఎం చంద్రబాబుకు కీలక సూచన
AP PCC Chief YS Sharmila

విజయవాడ, ఫిబ్రవరి 04: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల గణన సర్వే చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఐదున్నర కోట్ల రాష్ట్ర జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య ఎంతో తేల్చాలంటూ ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆమె సూచించారు. మంగళవారం విజయవాడలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదున్నర కోట్ల జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య ఎంతో తేల్చాలన్నారు. అలాగే కుల వివక్షకు గురవుతున్న బలహీన వర్గాల ప్రజలు ఎంత మంది ఉన్నారో లెక్కలు తీయాలని ప్రభుత్వానికి విజ్జప్తి చేశారు.

మనమెంతో మనకంతా అన్నట్లుగా.. రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగాలలో వారి వాటా వారికి దక్కాల్సి ఉందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. జనాభా ప్రాతిపదికన న్యాయంగా రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు కులగణన చేపట్టినా.. బీజేపీ దత్తపుత్రుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్.. ఆ సర్వే వివరాలు తొక్కిపెట్టారని వైఎస్ షర్మిల వ్యంగ్యంగా అన్నారు. ఆ వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారంటూ మాజీ సీఎం వైఎస్ జగన్‍పై మండిపడ్డారు. బీజేపీ డైరెక్షన్‍లోనే సర్వే రిపోర్టు బయటకు పొక్కకుండా కుట్ర చేశారంటూ వైఎస్ జగన్‍పై నిప్పులు చెరిగారు.


ఇక ఓ వైపు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని లోక్‍సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుంటే.. రిజర్వేషన్ల రద్దుకు కుట్ర అంటూ బీజేపీ తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఉచ్చులో మీరు పడవద్దంటూ సీఎం చంద్రబాబుకు ఈ సందర్భంగా వైఎస్ షర్మిల సూచించారు. వెంటనే ఏపీలో సైతం కులగణన సర్వే చేపట్టాలని.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సూచించారు.


మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల అభివర్ణించారు. ఇదో చారిత్రాత్మక ఘట్టమన్నారు. ఈ సర్వే యావత్ భారతావనికి దిక్సూచి అని తెలిపారు. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ దూరదృష్టికి ఇదొక నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు, 17 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు ఉన్నారని.. అంటే దాదాపు 90 శాతం వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలే ఉండటం విస్మయపరిచిన అంశమని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైతం ఇదే పరిస్థితి ఉంటుందని తాము నమ్ముతున్నామని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల పేర్కొన్నారు.


గతంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. దేశవ్యాప్తంగా జోడో యాత్ర చేశారు. ఈ సందర్భంగా దేశంలో కుల గణన జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. కుల గణన సర్వే చేపడతామని ఆయన ప్రకటించారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో తెలంగాణ వ్యాప్తంగా కుల గణన సర్వే చేపట్టారు. ఆ సర్వే వివరాలను ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‍లో సైతం కుల గణన సర్వే నిర్వహించాలని చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 04 , 2025 | 03:21 PM