Alapati Suresh: అమరావతిపై.. అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి..
ABN , Publish Date - Aug 28 , 2025 | 02:01 PM
సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో అమరావతిపై అబద్దపు ప్రచారం, భావ ప్రకటన స్వేచ్చ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో వందల ఏళ్లుగా ప్రజలు నివాసాలు ఉంటున్నారని తెలిపారు. మొన్న వచ్చిన వరదలకే మునిగిపోయిందని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు..
విజయవాడ: సీఆర్ మీడియా (C.Raghavachari Media Academy) అకాడమీ ఆధ్వర్యంలో అమరావతిపై అబద్దపు ప్రచారం, భావ ప్రకటన స్వేచ్చ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఎంతోమంది కన్నీరు పెట్టారన్నారు. ఆంధ్ర ప్రాంత ప్రజల కోసం ఒక రాజధానిగా అమరావతిని ఆనాటి ప్రభుత్వం ప్రకటించిందని, రాజకీయంగా అప్పుడు అందరూ ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. ప్రజల సహకారంతో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టారని చెప్పారు. అయితే ప్రభుత్వం మారగానే అమరావతికి గ్రహణం పట్టిందన్నారు. రాజధానిని పూర్తిగా చంపేలా కుట్రలు చేశారని తెలిపారు. రాజధాని కోసం త్యాగాలు చేసిన రైతులను అవమానించారని, అమరావతిపై బురద జల్లడమే కాకుండా కుట్రలు చేశారని మండిపడ్డారు. మూడు రాజధానుల పేరుతో పక్కా ప్లాన్‌తో అమరావతి లేకుండా చేయాలని చూశారన్నారు. ఈ క్రమంలోనే అమరావతి ముంపు ప్రాంతం అని ప్రచారం చేయించారని చెప్పారు.
ఇన్ సైడ్ ట్రేడింగ్ అని ప్రచారం చేయగా.. అదేం లేదని హైకోర్టు తీర్పు ఇచ్చిందని ఆలపాటి సురేష్ అన్నారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని గుర్తు చేశారు. అయితే మళ్లీ ఇప్పుడు అమరావతి మునిగిపోతుందంటూ అసత్య ప్రచారం మొదలైందన్నారు. సోషల్ మీడియాతో పాటూ ఒకవింగ్ ప్రధాన మీడియాలో అమరావతి చెరువు అంటూ కథనాలు రాశారన్నారు. రాజధాని ప్రాంతంలో వందల ఏళ్లుగా ప్రజలు నివాసాలు ఉంటున్నారని తెలిపారు. మొన్న వచ్చిన వరదలకే మునిగిపోయిందని రాశారని.. దీనిపై ప్రశ్నిస్తే.. భావ ప్రకటన స్వేచ్చ మాకు లేదా అని అంటున్నారని చెప్పారు. నిజాన్ని వక్రీకరించి.. దుర్మార్గంతో అబద్దాలు ప్రచారం చేయడం.. భావ ప్రకటన స్వేచ్చ కిందకు వస్తుందా.. అంటూ నిలదీశారు. నిజాన్ని కాదని అబద్దాలు చెప్పే హక్కు ఎవరికీ ఉండదని పేర్కొన్నారు.
హక్కుల గురించి మాట్లాడేవారికి నిజాలు చూపే ధైర్యం ఉండాలంటూ ఆలపాటి సురేష్ అన్నారు. భారత రాజ్యాంగంలో మీడియా స్వేచ్చ అనేది ఎక్కడా లేదని.. భావప్రకటన స్వేచ్చ పేరుతో ఇష్టం వచ్చినట్లుగా అబద్దాలు ప్రచారం చేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. 19 1a ద్వారా వచ్చిన హక్కులే మీడియాకు కూడా వర్తిస్తున్నాయని, ఎవరైనా రాజ్యాంగ వ్యవస్థ లకు కట్టుబడే పని చేయాలని గుర్తు చేశారు. మీడియా సమాజ శ్రేయస్సు, సమాజ హితం కోసం పని చేయాలని హితవుపలికారు. అమరావతిని ఎదగకుండా చేసే కుట్ర జరుగుతుందన్నారు. అందుకే పదే పదే అబద్దాలు ప్రచారం చేస్తూ అమరావతిపై విషం చిమ్ముతున్నారని చెప్పారు.
అందరూ నడుం బిగించి అమరావతిపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తిప్పి కొట్టాలంటూ ఆలపాటి సురేష్ పిలుపునిచ్చారు. అమరావతి ముంపు ప్రాంతం కాదు..అభివృద్ధి చెందే రాజధాని అనే వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి విష ప్రచారాలను తిప్పి కొట్టాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి సునీల్ చౌదరి, ప్రముఖ చరిత్రకారులు సాయి, వివిధ రంగాల నిపుణులు, రాజధాని ప్రాంతాల రైతులు, మహిళలు పాల్గొన్నారు.
Also Read:
హుస్సేన్ సాగర్‌కు పోటెత్తిన వరద
ప్రకాశం బ్యారేజ్‌కు మొదటి ప్రమాద హెచ్చరిక
For More Latest News