Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌కు మొదటి ప్రమాద హెచ్చరిక
ABN , Publish Date - Aug 28 , 2025 | 01:28 PM
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ప్రవాహం తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌కు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
విజయవాడ: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ప్రవాహం తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌కు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ, ప్రస్తుతం బ్యారేజ్‌లోకి 4,05,790 క్యూసెక్కుల నీరు వచ్చిందని తెలిపారు. ఈ వరద నీటిని నియంత్రించేందుకు ప్రకాశం బ్యారేజ్‌లోని 66 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసినట్లు తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో 33 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైతే ప్రజలు ఈ కేంద్రాలకు తరలిపోవాలని సూచించారు.
కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ, కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అని పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ఇళ్లను గుర్తించామని, సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చి సమాచారం ఇచ్చిన వెంటనే పునరావాస కేంద్రాలకు వెళ్లడం మంచిదని సూచించారు.
ప్రమాదం లేదు
తిరువూరులో నిన్న రాత్రి 30 నుండి 40 సెం.మీ. వర్షపాతం నమోదైనప్పటికీ, ఆ నీరు బుడమేరికి చేరినా అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవని అధికారులు తెలిపారు. ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు బయటకు వెళ్లొద్దని సూచించారు. అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు. అప్రమత్తతతోనే ప్రాణాలు కాపాడుకోగలుగుతామని వివరించారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఎన్టీఆర్ కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ కమాండ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారు.
Also Read:
హుస్సేన్ సాగర్‌కు పోటెత్తిన వరద
దిండ్లకూ ఎక్స్‌పైరీ డేట్.. ? గడువులోగా మార్చకపోతే ఈ సమస్యలు..!
For More Latest News