Share News

Narendra Modi: అండగా నిలుస్తా భుజం కలిపి నడుస్తా

ABN , Publish Date - May 03 , 2025 | 03:43 AM

ప్రధాని మోదీ అమరావతిలో జరిగిన సభలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారం అందించామని చెప్పారు. అమరావతి, ఏపీని ఆధునాతన ప్రదేశ్‌గా మారుస్తుందన్నారు

Narendra Modi: అండగా నిలుస్తా భుజం కలిపి నడుస్తా

అమరావతికి, ఆంధ్రప్రదేశ్‌కు సంపూర్ణ సహకారం: మోదీ

స్వర్ణాంధ్ర సాధనకు అమరావతి ‘శక్తి’!

ఏపీని అధునాతన ప్రదేశ్‌గా మార్చేస్తుంది

  • ఐటీ, ఏఐ, విద్య, వైద్యానికి ఇదే ‘లీడింగ్‌ సిటీ’

  • చంద్రబాబు రాకతో గ్రహాలు తొలగిపోయాయి

  • అమరావతి పూర్తయ్యాక ఏపీ జీడీపీకి రెక్కలు

  • అంతరిక్షంతోపాటు రక్షణలోనూ ఏపీ పతాక

  • నాగాయలంక మిస్సైల్‌ టెస్ట్‌ రేంజ్‌తో ఘనత

  • ‘జూన్‌ 21’న విశాఖలో యోగా చేస్తా

  • ‘అమరావతి పునఃప్రారంభ’ సభలో ప్రధాని

  • పలు ప్రాజెక్టులకు శ్రీకారం, ప్రారంభం

చంద్రబాబుకు సాటి లేరు..

నా అనుభవంతో చెబుతున్నా! ఫ్యూచర్‌ టెక్నాలజీతోపాటు.. భారీ ప్రాజెక్టులను త్వరగా, అత్యుత్తమంగా పూర్తిచేయడం చంద్రబాబుకే సాధ్యం. రాష్ట్రంలోని ప్రతి యువకుడూ తన కలలు నెరవేర్చుకునే నగరంలా అమరావతి రూపుదిద్దుకుంటుంది. ఐటీ, ఏఐ, గ్రీన్‌ ఎనర్జీ, క్లీన్‌ ఇండస్ట్రీ, విద్యా, వైద్యం.. ఇలా కీలక రంగాల్లో లీడింగ్‌ సిటీ అవుతుంది. ఈ రంగాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు, రికార్డు స్థాయిలో పనులు పూర్తయ్యేందుకు కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుంది.

నాడు చంద్రబాబును చూసి టెక్నాలజీ నేర్చుకున్నా..

టెక్నాలజీలో చాలా ముందున్నానని చంద్రబాబు నన్ను ప్రశంసించారు. కానీ, ఓ రహస్యం చెబుతా. నేను గుజరాత్‌ సీఎం అయిన కొత్తలో.. అప్పటికే చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చుని చేస్తున్న పనులన్నీ నిశితంగా పరిశీలించే వాడిని. మా అధికారులతోనూ అధ్యయనం చేయించా. టెక్నాలజీ విషయంలో చంద్రబాబు నుంచి చాలా నేర్చుకున్నా. అప్పుడు నేర్చుకున్నవే ఇప్పుడు అమలు చేస్తున్నా.

- ప్రధాని మోదీ


‘అమరావతి పునఃప్రారంభ’ సభలో మోదీ

అమరావతి, మే 2 (ఆంధ్రజ్యోతి): ‘‘ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు సరైన దారిలో వెళుతోంది. సరైన వేగం అందుకుంది. రాష్ట్రాభివృద్ధి ప్రస్థానంలో మీతో భుజం కలిపి నడుస్తాను’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. అమరావతి పనుల పునరుద్ధరణతోపాటు రాష్ట్రంలోని పలు రైల్వే, రహదారులు, రక్షణ ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా అమరావతిలోని వెలగపూడి సచివాలయ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. అమరావతి, పోలవరం పూర్తికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అమరావతిని ఒక ‘శక్తి’గా అభివర్ణించారు. ‘‘అమరావతి... స్వర్ణాంధ్ర విజన్‌కు శక్తినిస్తుంది. స్వర్ణాంధ్ర.. వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని బలపరుస్తుంది. అమరావతి కేవలం ఒక నగరం కాదు... అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్‌ను ఆధునిక ప్రదేశ్‌గా, అధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి’’ అని ఉద్ఘాటించారు. చంద్రబాబు మూడేళ్లలో అమరావతిని నిర్మిస్తామని లక్ష్యంగా పెట్టుకున్నారని... ఆ తర్వాత రాష్ట్ర జీడీపీని అమరావతి నగరం ఎక్కడికి తీసుకెళుతుందో తాను ఊహించగలనని ప్రధాని అన్నారు. ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అమరావతి, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి భుజం కలిని నడుస్తానని భరోసా ఇచ్చారు. ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు... ఆయన మాటల్లోనే!


dser.jpg

భవిష్యత్‌ నగరం...

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలారా... అమరావతి ఇంద్రలోకపు రాజధాని. ఇప్పుడు... అమరావతి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని. ఇది యాదృచ్ఛికం కాదు. స్వర్ణాంధ్ర నిర్మాణానికి శుభ సంకేతం. అమరావతి పుణ్యభూమిపై నిలబడిన ఈ క్షణం నాకు భవిష్యత్‌ నగరం కనిపిస్తోంది. ఒక కల నెరవేరుతున్న క్షణాలు కనిపిస్తున్నాయి. ఒక కొత్త అమరావతి, ఒక కొత్త ఆంధ్రప్రదేశ్‌ కనిపిస్తున్నాయి. ఒకవైపు బౌద్ధవారసత్వ శాంతి... మరోవైపు వికసిత్‌ భారత్‌ను నిర్మించుకునే శక్తి అమరావతిలో ఉన్నాయి. ఇప్పుడు దాదాపు రూ.60వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిగాయి. ఇవి కేవలం కాంక్రీట్‌ నిర్మాణాలు కావు. ఏపీ ప్రజల ఆకాంక్షలు, వికసిత్‌ భారత్‌ ఆశలకు బలమైన పునాదులు. భగవాన్‌ వీర భద్రస్వామి, అమర లింగేశ్వరుడు, తిరుపతి బాలాజీ పాదాలకు ప్రణమిల్లుతూ... ఏపీ ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నా.

మనమే చేయాలి...

2015లో ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసే అవకాశం నాకు లభించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అమరావతికి మద్దతు ఇచ్చింది. నాడు ఎన్టీఆర్‌ వికసిత ఆంధ్రప్రదేశ్‌ గురించి కలగన్నారు. ఇప్పుడు దానిని సాకారం చేయాలి. ఆంధ్రప్రదేశ్‌ను, అమరావతిని వికసిత్‌ భారత్‌కు గ్రోత్‌ ఇంజిన్‌లా మార్చాలి. చంద్రబాబు గారు, బ్రదర్‌ పవన్‌ కల్యాణ్‌ ఇది మనం చేయాలి. ఇది మనమే చేయాలి!


మౌలికంతో వికాసం..

గత పదేళ్లలో భారత దేశంలో భౌతిక, సాంకేతిక, సామాజిక మౌలిక సదుపాయాలు ఎంతగానో పెరిగాయి. దాని ఫలాలు ఆంధ్రప్రదేశ్‌కూ లభిస్తున్నాయి. నేడు రాష్ట్రానికి వేల కోట్ల విలువైన రైల్వే, రహదారి ప్రాజెక్టులు లభించాయి. జిల్లాల మధ్య, పొరుగు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. రైతులు తమ ఉత్పుత్తులను పెద్ద మార్కెట్లకు తరలించవచ్చు. ఉద్యోగులకు, కార్మికులకు రవాణా మెరుగుపడుతుంది. పర్యాటకం మెరుగవుతుంది. ఉదాహరణకు... రేణిగుంట - నాయుడుపేట హైవే పూర్తి కావడంవల్ల తిరుపతికి ప్రయాణం సులువు అవుతుంది. బాలాజీ దర్శనం వేగంగా జరుగుతుంది. మౌలిక సదుపాయాల కల్పన పనులతో సిమెంటు, స్టీల్‌, రవాణా వంటి ఇతర రంగాలూ ఊపందుకుంటాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు చేపట్టిన ప్రాజెక్టుల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో వేలాదిమంది యువతకు ఉపాధి లభిస్తుంది.


పది రెట్లు పెరిగిన ‘రైల్వే నిధులు’

ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం రికార్డుస్థాయిలో నిధులు కేటాయించాం. 2009-14లో తెలంగాణతో కలిసి ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే ప్రాజెక్టులకు కేవలం రూ.900 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు... నవ్యాంధ్రకు మాత్రమే రైల్వే బడ్జెట్‌ 9వేల కోట్లు దాటింది. అంటే... పది రెట్లు ఎక్కువ. కేంద్రం ఇచ్చిన నిధులతో ఏపీలో రైల్వే వందశాతం విద్యుదీకరణ జరిగిపోయింది. రాష్ట్రానికి 8 వందేభారత్‌ రైళ్లు వచ్చాయి. ‘అమృత్‌ భారత్‌’ రైలు కూడా వస్తుంది. రాష్ట్రంలో 750కి పైగా ఆర్వోబీలు, అండర్‌ పాస్‌లు నిర్మించాం. 70కిపైగా రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నాం.

రైతులకు అండగా ఎన్డీయే

‘వికసిత్‌ భారత్‌’కు పేదలు, రైతులు, యువకులు, మహిళలు... నాలుగు స్తంభాలని ఎర్రకోటపై నుంచి ఉద్ఘాటించాను. రైతులకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం. పదేళ్లలో ఎరువుల కోసం రూ.12 లక్షల కోట్ల భారం భరించాం. పంటల బీమా కింద ఏపీ రైతులకే రూ.5500 కోట్లు పరిహారం చెల్లించాం. పీఎం కిసాన్‌ నిధి సమ్మాన్‌ ద్వారా రాష్ట్ర రైతుల ఖాతాల్లో 17,500 కోట్లు జ మ చేశాం. ప్రతి ఎకరాకూ నీరు అందాలన్నదే మా లక్ష్యం. పోలవరం ప్రాజెక్టు నిర్మా ణం వేగం పుంజుకుంది. ఈ ప్రాజెక్టు వేగం గా పూర్తయ్యేలా మద్దతిస్తాం.


అంతరిక్షం నుంచి రక్షణ దాకా ఏపీ

దేశాన్ని అంతరిక్ష శక్తిగా మార్చడంలో దశాబ్దాలుగా ఏపీ కీలక పాత్ర పోషిస్తోంది. శ్రీహరికోట నుంచి నింగికెగిసే ప్రతి రాకెట్‌ కోట్లాదిమంది భారతీయులను గర్వపడేలా చేస్తుంది. ఇప్పుడు... దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేసే కొత్త సంస్థ ఏపీలో ఏర్పాటవుతోంది. అదే... నాగాయలంక మిసైల్‌ టెస్టింగ్‌ రేంజ్‌! ‘నవదుర్గా మిస్సైల్‌ టెస్టింగ్‌ రేంజ్‌’... దుర్గామాతలాగా దేశ రక్షణకు కొత్త శక్తినిస్తుంది.

విశాఖలో ఏకతా మాల్‌

ఇప్పుడు భారతదేశ శక్తి... ఆయుధాల్లో మాత్రమే లేదు. మన ఐక్యతలో కూడా ఉంది. ఇదే భావనతోనే... దేశవ్యాప్తంగా ‘ఏకతా మాల్స్‌’ ఏర్పాటు చేస్తున్నాం. అందులో... విశాఖలో ఒకటి నిర్మిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న హస్తకళాకారుల ఉత్పత్తులు ఒకే చోట అందుబాటులోకి వస్తాయి. భారత దేశంలోని వైవిధ్యత ఒకేచోట కనిపిస్తుంది. స్థానిక కళాకారులకూ మేలు జరుగుతుంది. ‘ఏక్‌భారత్‌, శ్రేష్ట్‌ భారత్‌’ భావన బలపడుతుంది.

ప్రపంచం ఏపీ వైపు చూసేలా ‘యోగా డే’

‘జూన్‌ 21’ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించి ఈ ఏడాదికి పదేళ్లు అవుతోంది. ఈ అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఈ ఏడాది ప్రధాన కార్యక్రమాన్ని ఏపీలో నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆ రోజు నేను విశాఖపట్నం వస్తాను. మీ అందరితో కలిసి యోగా చేస్తాను. దీనికి ఇంకా 50 రోజుల సమయం ఉంది. ప్రతి గ్రామానికీ, ఇంటికీ ‘యోగా’ను తీసుకెళ్లండి. ప్రాచుర్యం కల్పించండి. ఈసారి జూన్‌ 21వ తేదీన ప్రపంచమంతా ఏపీవైపు చూస్తుంది. మొత్తం ప్రపంచం ఆశ్చర్యపోయేలా రికార్డు సృష్టిద్దాం. చంద్రబాబు ఆ పని చేస్తారని నాకు నమ్మకముంది.


ఇవి కూడా చదవండి

Chandrababu Naidu: ఉగ్రదాడి.. ప్రధాని మోదీ వెంటే ఉంటామన్న సీఎం చంద్రబాబు

Pawan Kalyan : భారతదేశానికి తలమానికం అమరావతి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Updated Date - May 03 , 2025 | 06:31 AM