Shooting Incident In Nellore: నెల్లూరులో కాల్పుల కలకలం.. రెండు రౌండ్లు పోలీసుల కాల్పులు
ABN , Publish Date - Aug 17 , 2025 | 05:25 PM
నిందితుడి ప్రకాష్‌ను అదుపులోకి తీసుకుని తన వద్ద నుంచి 22 కిలోల గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రకాష్‌పై ఈస్ట్ గోదావరి, ఏలూరు, నెల్లూరులో పలు గంజాయి కేసులు నమోదు అయినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.
నెల్లూరు: జిల్లా కేంద్రంలో కాల్పుల కలకలం ఒక్కసారిగా ప్రజలను భయాందోళనకు గురిచేసింది. నగరంలో పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. రాజమండ్రికి చెందిన బీకర ప్రకాష్ అనే వ్యక్తి కారులో గంజాయి తరలిస్తుండగా.. పోలీసులు సినిమా తరహాలో ఛేజింగ్ చేసి ప్రకాష్‌ను పట్టుకోవాడానికి ప్రయత్నం చేశారు. పోలీసుల నుంచి తప్పించునే ప్రయత్నంలో ప్రకాష్ వేగంగా.. పోలీసు వాహానాన్ని ఢికొట్టాడు. ఈ ఘటనలో పోలీస్ కారులోని కానిస్టేబుల్ ఫిరోజ్‌కి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో ప్రాణ రక్షణ కోసం సీఐ సాంబశివరావు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం ప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి ప్రకాష్‌ను అదుపులోకి తీసుకుని తన వద్ద నుంచి 22 కిలోల గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రకాష్‌పై ఈస్ట్ గోదావరి, ఏలూరు, నెల్లూరులో పలు గంజాయి కేసులు నమోదు అయినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఈగల్ టీం ఐజీ రవికృష్ణ, ఎస్పీ కృష్ణ కాంత్ మీడియాకు వెల్లడించారు.
పోలీసులు, ఈగల్ బృందాలు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ప్రకాష్ వాహనాన్ని చేజ్ చేశాయని ఐజీ రవికృష్ణ తెలిపారు. నేరస్థుడు వాహనం స్పీడ్‌గా వెనక్కి తీసెటప్పుడు కానిస్టేబుల్‌కి గాయాలు అయ్యాయని పేర్కొన్నారు. ఈగల్ టీమ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల కిలోల గంజాయిని పెట్టుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ గరుడ, ఈగల్ పేరుతో గంజాయి నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. విద్యార్థులకు గంజాయి దొరక్కుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ఒరిస్సా నుంచి గంజాయి రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. శివారు ప్రాంతాల్లో డ్రోన్స్ ద్వారా ప్రత్యేక నిఘా పెట్టామని వెల్లడించారు. ప్రజలు గంజాయి సంబంధించిన సమాచారాన్ని 1972కి కాల్ చేసి చెప్పాలని.. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఐజీ చెప్పుకొచ్చారు.
కారులో గంజాయి వెళ్తుందనే సమాచారంతోనే పోలీసులు వెంబడించారని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. ప్రకాష్ కారుకు రెండు వైపులా పోలీసు వాహనాలను ఆపారని పేర్కొన్నారు. తప్పించుకునే ప్రయత్నంలో ఒక కారుకు ఢికొట్టాడని చెప్పారు. నిందితుడి వద్ద నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, అరెస్టు చేసినట్లు వెల్లడించారు. గంజాయి సరఫరా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఢిల్లీకి మంత్రి లోకేశ్.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు
బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ