Minister Satya Prasad: త్వరలో జిల్లాల పేర్లు మార్పు.. అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు...
ABN , Publish Date - Aug 11 , 2025 | 02:55 PM
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు.. సిద్ధం అయ్యింది. ఈ మేరకు రాష్ట్రంలో జిల్లాల పేర్లు మార్పు.. సరిహద్దుల మార్పులపై ఈనెల 13వ తేదీన జీవోఎం భేటి కానుంది.
అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు.. సిద్ధం అయ్యింది. ఈ మేరకు రాష్ట్రంలో జిల్లాల పేర్లు మార్పు.. సరిహద్దుల మార్పులపై కసరత్తు చేస్తుంది. ఈనెల 13వ తేదీన జీవోఎం భేటి కానుంది. తాజాగా ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో జిల్లాల పునర్విభజనకు సంబంధించిన అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించడం, నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రజల నుండి వినతులకు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. అయితే.. ఈ పేర్ల మార్పుతో జిల్లాల సంఖ్య పెరుగుతుందనే చర్చ జరుగుతోంది.
గత వైసీపీ ప్రభుత్వం జిల్లాల పునఃవ్యవస్థీకరణ చేసినప్పుడు ఒక నియమం అంటూ.. పాటించకుండా అడ్డదిడ్డంగా చేశారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. కానీ ఇప్పుడు నియమనిబంధనలతో మేధావుల సూచనల మేరకు జిల్లాల పేర్ల మార్పు.. సరిహద్దుల మార్పులకు పూనుకున్నట్లు తెలిపారు. జిల్లా పేర్లు మార్పు విషయంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలకు పేర్లు పెట్టడంలోనూ వివాదాలు తలెత్తాయని మంత్రి చెప్పుకొచ్చారు.
జిల్లా, మండల, గ్రామాల పేర్లను మార్చాలంటూ.. వాటి సరిహద్దులు మార్చాలంటూ.. ప్రజలు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి పదే పదే విన్నవించుకున్నారని మంత్రి సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పరిష్కార మార్గాలను చూపేందుకు మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో పాటు మరో ఆరుగురి మంత్రుల బృందంతో జీవోఎం కమీటీని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. కమిటీ ఈనెల 13వ తేదీన మొదటిసారి సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు. కావున.. ప్రజలు, ప్రజా ప్రతినిధులు.. జిల్లా, మండల, గ్రామాల పేర్లు మార్పు, సరిహద్దుల మార్పుపైన వారి వినతులను సచివాలయానికి వచ్చి జీవోఎం కమిటీకి సమర్పించవచ్చు అని వివరించారు.
ఈ జీవోఎం కమిటీలో మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, నీటి వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సభ్యులుగా ఉన్నట్లు మంత్రి అనగాని వివరించారు. ప్రతి ఒక్కరూ జిల్లాల పేర్ల మార్పు విషయంలో తమ వినతులను.. అభ్యంతరాలను కమిటీకి అందిచాలని సూచించారు. వినతులను పరిశీలించిన అనంతరం వాటి ఆధారంగా జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులకు జీవోఎం కమిటీ చర్యలు తీసుకుంటుందని మంత్రి అనగాని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..