CM Chandrababu In Nandagokulam: నందగోకులంలో చంద్రబాబు పర్యటన.. లైఫ్ స్కూల్ ప్రారంభం
ABN , Publish Date - Oct 10 , 2025 | 05:41 PM
నందగోకులంలో పశువుల పరిరక్షణ, లైఫ్ స్కూల్, ఇథనాల్ ప్లాంట్‌ను ప్రారంభించడం తనకు కొత్త ఎక్స్‌పీరియన్స్ అని చంద్రబాబు తెలిపారు. 15,000 టన్నుల ధాన్యం నూకలతో ఇథనాల్ తయారు చేస్తున్నారని పేర్కొన్నారు.
నెల్లూరు: సమాజంలో పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ సమాజానికి తిరిగి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ఈదగాలిలో విశ్వసముద్ర గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించిన నందగోకులం లైఫ్ స్కూల్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించి.. కంప్యూటర్ ల్యాబ్ లో విద్యార్థులతో ముచ్చటించారు సీఎం. అనంతరం విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్రాంట్‌ను సందర్శించారు. అలాగే.. విశ్వసముద్ర గ్రూప్ ప్రాజెక్ట్‌లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
ఎద్దులతో విద్యుత్తు ఉత్పత్తి చేయడం ఎక్కడా లేదు..
నందగోకులంలో పశువుల పరిరక్షణ, లైఫ్ స్కూల్, ఇథనాల్ ప్లాంట్‌ను ప్రారంభించడం తనకు కొత్త ఎక్స్‌పీరియన్స్ అని చంద్రబాబు తెలిపారు. 15,000 టన్నుల ధాన్యం నూకలతో ఇథనాల్ తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. దీని ద్వారా రైతులకి ఆదాయం పెరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. ప్రకృతి పరిరక్షణకి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలని అందిపుచ్చుకున్నారని చెప్పారు. ఎద్దులతో విద్యుత్తు ఉత్పత్తి చేయడం ఎక్కడా లేదని చెప్పారు. పవర్ ఆఫ్ బుల్స్ చాటుతూ.. 5 యూనిట్లు విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారని చంద్రబాబు వివరించారు.
సేవ్ ది బుల్ అనే నినాదం ఎంతో విశిష్టమైంది..
నందగోకులం సేవ్ ది బుల్ అనే నినాదం ఎంతో విశిష్టమైందని చంద్రబాబు గుర్తు చేశారు. నందగోకులం లైఫ్ స్కూల్లో పేద పిల్లలకి చదువులు చెబుతున్నారని చెప్పారు. సామాన్య పిల్లలని అనితరసాధ్య వ్యక్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం గొప్ప విషయమని కొనియాడారు. సమాజం వల్ల పైకొచ్చిన వారు సమాజానికి డబ్బు ఇవ్వడం కాదు. పిల్లలకి అన్ని సదుపాయాలు కల్పించి, బెస్ట్ సిటిజన్స్‌లా తయారు చేయాలని ఆయన సూచించారు.
విశాఖలో రూ.87వేల కోట్లతో ఆర్టిఫిషియల్ సెంటర్..
P4 మోడల్లో చింతా శశిధర్ ఫౌండేషన్ ది బెస్ట్ స్కూల్ నడుపుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. దగదర్తిలో ఎయిర్ పోర్టు, కృష్ణపట్నంకి సీ పోర్టు, నేషనల్ హైవే, రైల్వే కనెక్టవిటీలు వస్తాయని స్పష్టం చేశారు. 2047లో ప్రపంచంలోనే మనదేశం ఒక శక్తిగా ఎదగబోతుందని ధీమా వ్యక్తం చేశారు. అందులో మన ఏపీ మరింత శక్తిగా ఎదుగుతుందని వివరించారు. విశాఖలో రూ.87వేల కోట్లతో ఆర్టిఫిషియల్ సెంటర్ రాబోతుందని చెప్పారు. పేదలని బయటకి తీసుకువచ్చే బాధ్యత అందరూ తీసుకోవాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..