Minister: టీడీపీ శ్రేణులకు మంత్రి సూచన.. బొట్టుపెట్టి పిలవండి..
ABN , Publish Date - Sep 06 , 2025 | 01:07 PM
‘అనంతపురం అర్బన్‌లోని ప్రతి ఇంటికీ వెళ్లండి.. ఆడపడుచులకు బొట్టుపెట్టి, సూపర్‌హిట్ సభకు ఆహ్వానించండి. అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచే లక్ష మంది కదిలి రావాలి’ అంటూ మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ శ్రేణులకు సూచించారు.
- ఇంటింటికీ వెళ్లి ఆడపడుచులను ఆహ్వానించండి
- టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
- వైసీపీ ఫేక్ ప్రచారం తిప్పికొట్టండి
- ఆప్కాబ్ చైర్మన్ గండి వీరాంజనేయులు
- బహిరంగ సభ విజయవంతం చేద్దాం: ఎమ్మెల్యే దగ్గుపాటి
అనంతపురం: ‘అనంతపురం అర్బన్‌లోని ప్రతి ఇంటికీ వెళ్లండి.. ఆడపడుచులకు బొట్టుపెట్టి, సూపర్‌హిట్ సభకు ఆహ్వానించండి. అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచే లక్ష మంది కదిలి రావాలి’ అంటూ మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) టీడీపీ శ్రేణులకు సూచించారు. నగరంలోని మారుతీనగర్ సాయిబాబా గుడి కల్యాణమండపంలో శుక్రవారం అర్బన్ టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు.
అందుకే ఎన్నికల్లో కూటమి పార్టీలకు 175 స్థానాలకు 164 కట్టబెట్టారన్నారు. ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే పింఛన్‌ను రూ.4వేలకు పెంచామన్నారు. దివ్యాంగుల ఫించన్ రూ.3 వేల నుంచి రూ.6 వేలకు, బెడ్‌పై లేవలేని స్థితిలో ఉన్న వాళ్లకు రూ. 15 వేలు, దీర్ఘకాలిక జబ్బులతో ఉన్న వాళ్లకు రూ.10 వేలు ఇచ్చామన్నారు. ఏడాది కాలంలోనే పింఛన్ల కోసం రూ.35 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం తమదేనన్నారు. మహిళలకు ఉచితబస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవన, తల్లికి వందనం 16,400 డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియ ఇవన్నీ కూటమి ప్రభుత్వమే అందించిందని తెలిపారు.
ఈ విషయాలన్నీ ప్రజలకు తెలిపేందుకు అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ మాట్లాడుతూ గత 44 ఏళ్లలో తొలిసారి అనంతపురంలో భారీ బహిరంగ సభ జరగబోతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మనపై పెట్టిన బాధ్యతను విజయవంతంగా నిర్వహించాలన్నారు. 3.5 లక్షల మంది సభకు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. టీడీపీ జోన్-5 ఇన్‌చార్జ్, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ ఎన్నికల ముందు కష్టపడి కూటమిని గెలిపించారని, ఇప్పుడు ఈ విజయోత్సవ సభను సైతం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

అర్బన్ పరిశీలకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 11 సీట్లు ఇచ్చినా జగన్‌కు బుద్ధి రాలేదన్నారు. తిరుమల పవిత్రతను సైతం దెబ్బతియ్యాలని చూశాడని, ఆఖరికి టికెట్లు కూడా అమ్ముకున్నారంటూ మండిపడ్డారు. 10న జరిగే సభను విజయవంతం చేయాలని సూచించారు. అంతకు ముందు ఆప్కాబ్ చైర్మన్ గండి వీరాంజనేయులు మాట్లాడుతూ వైసీపీ నాయకుల ఫేక్ ప్రచారాలను టీడీపీ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఈ కార్యక్రమాన్ని చాలెంజ్‌గా తీసుకుని విజయవంతం చేయాలని కోరారు.
ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు మాట్లాడుతూ అనంతపురం ఉమ్మడి జల్లా టీడీపీకి కంచుకోట అన్నారు. కార్యక్రమంలో లింగాయత్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ స్వప్న, టీడీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు ఆదినారాయణ, బుగ్గయ్య చౌదరి, రాయల్ మురళి, జేయల్ మురళి, స్వామిదాస్, మదమంచి స్వరూప, డైరెక్టర్లు పీఎల్‌ఎన్ మూర్తి, పోతుల లక్ష్మినరసింహులు, బొమ్మినేని శివ, పరమేశ్వర్, కొండన్న, నాయకులు సుధాకర్‌నాయుడు, చేపలహరి, సుధాకర్ యాదవ్, సింగవరం రవి, నెట్టెం బాలకృష్ణ, తేజస్విని, హరి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పదేళ్ల బాలుడికి గుండె పోటు.. తల్లి ఒడిలోనే కన్నుమూత
Read Latest Telangana News and National News