Total Lunar Eclipse: రేపు సంపూర్ణ చంద్రగ్రహణం
ABN , Publish Date - Sep 06 , 2025 | 05:06 AM
ఈ నెల 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. 2022 తర్వాత భారత్ నుంచి అత్యంత ఎక్కువ సేపు కనింపించే సంపూర్ణ చంద్రగ్రహణంగా ఇది నిలవనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.
రాత్రి 8:58కి ప్రారంభమై అర్ధరాత్రి 2:25 గంటల వరకు
2022 తర్వాత ఎక్కువ సమయం కనిపించే అవకాశం
బెంగళూరు, సెప్టెంబరు 5: ఈ నెల 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. 2022 తర్వాత భారత్ నుంచి అత్యంత ఎక్కువ సేపు కనింపించే సంపూర్ణ చంద్రగ్రహణంగా ఇది నిలవనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే 2018 జూలై 27 తర్వాత భారత్‌లోని అన్ని ప్రాంతాల నుంచి సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని వీక్షించడం ఇదే మొదటిసారి కానుందని పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న దివ్యా ఒబెరాయ్ చెప్పారు. మళ్లీ ఇలాంటి చంద్ర గ్రహణాన్ని చూడాలంటే 2028 డిసెంబరు 31 వరకూ వేచి చూడాలన్నారు. ఈ నెల 7, 8 తేదీల (ఆది, సోమవారం) మధ్య ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుందని వెల్లడించారు.
పబ్లిక్ ఔట్‌రీచ్, ఎడ్యుకేషన్ కమిటీ (పీవోఈసీ) విడుదల చేసిన ప్రకటన ప్రకారం... ఆదివారం రాత్రి 8:58 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 9:57 గంటల నుంచి పాక్షిక దశను గమనించవచ్చు. సంపూర్ణ గ్రహణ దశ రాత్రి 11:01 గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది అర్ధరాత్రి 12:23 గంటల వరకూ కొనసాగుతుంది. అంటే సంపూర్ణ గ్రహణ వ్యవధి దాదాపు 82 నిమిషాలు ఉంటుంది. 8వ తేదీ తెల్లవారుజామున 2:25 గంటలకు చంద్ర గ్రహణం ముగుస్తుంది.