Minister Nara Lokesh : కాగ్నిజెంట్ వస్తోంది!
ABN , Publish Date - Jan 24 , 2025 | 02:53 AM
రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సిద్ధంగా ఉందని, త్వరలోనే ఆ కంపెనీ నుంచి శుభవార్త వస్తుందని....
త్వరలోనే శుభవార్త: లోకేశ్
దావోస్‌లో ఆ సంస్థ సీఈవోతో భేటీ
టైర్ల యూనిట్ కోసం అపోలో
టైర్స్ ఎండీ నీరజ్ కన్వర్‌కు ఆహ్వానం
ఆర్‌ఈ పరికరాల పరిశ్రమ పెట్టాలని
ఎన్విజన్ సీఈవోను కోరిన ఐటీ మంత్రి
పుట్టినరోజునా లోకేశ్ వరుస భేటీలు
అమరావతి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సిద్ధంగా ఉందని, త్వరలోనే ఆ కంపెనీ నుంచి శుభవార్త వస్తుందని రాష్ట్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్, మానవవనరుల శాఖల మంత్రి లోకేశ్ ప్రకటించారు. గురువారం దావోస్‌లో ఆయన కాగ్నిజెంట్ సొల్యూషన్స్ సీఈవో ఎస్.రవికుమార్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న సానుకూలతలను వివరించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, రెన్యువబుల్ ఎనర్జీలో డీప్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో 2.2 మిలియన్ చదరపు అడుగుల కో-వర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉందని.. కాగ్నిజెంట్ గ్రోత్ స్ట్రాటజీ, ప్రాంతీయ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా విశాఖపట్నం వంటి టైర్-2 నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని సూచించారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటివాటిలో అత్యున్నత నైపుణ్యం ఉన్న పనివారిని తయారుచేయడానికి తమ ప్రభుత్వంతో భాగస్వామి కావాలని కోరారు. రవికుమార్ స్పందిస్తూ.. కాగ్నిజెంట్‌లో పనిచేస్తున్న 80 వేల మంది ఉద్యోగులను టైర్-1 నగరాల నుంచి టైర్ -2 నగరాలకు మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, ఏపీలోని టైర్-2 నగరాలపైనా దృష్టి సారించామని, తప్పకుండా రాష్ట్రానికి వస్తామని హామీ ఇచ్చారు. కాగా.. గురువారం లోకేశ్ జన్మదినం. ఆయన పుట్టిన రోజు వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున నిర్వహించుకుంటున్న సమయంలో ఆయన మాత్రం దావో్‌సలో రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే పనిలో నిమగ్నమయ్యారు. పుట్టిన రోజున కూడా ఉదయం నుంచే పారిశ్రామికవేత్తలతో భేటీలు నిర్వహిస్తూ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అనుకూల పరిస్థితులను వివరించే కార్యక్రమంలో తలమునకలయ్యారు. ఆయన కృషిని ఇతర రాష్ట్రాల ప్రతినిధులు అభినందించారు.
ఏడున్నర లక్షల మందికి ఉపాధి లక్ష్యంతో..
గ్రీన్ హైడ్రోజన్ రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి, ఏడున్నర లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని లోకేశ్ అన్నారు. ఎన్విజన్ సీఈవో లీ జంగ్‌తో ఆయన సమావేశమయ్యారు. ఏపీలో రెన్యువబుల్ ఎనర్జీ(ఆర్‌ఈ) పరికరాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. సానుకూల నిర్ణయం తీసుకుంటామని లీజంగ్ ఆయనకు హామీ ఇచ్చారు.
ఐరోపా మార్కెట్‌కు కనెక్ట్ చేయండి
ట్రేడ్ అండ్ ఎకనమిక్ పార్ట్‌నర్‌షిప్ అగ్రిమెంట్ (టెపా) ద్వారా ఏపీ తయారీదారులు ఐరోపా మార్కెట్‌కు అనుసంధానమయ్యేలా సహకరించాలని లోకేశ్ స్విట్లర్లాండ్‌కు చెందిన కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లా లూసియర్ బ్రాడర్ట్‌ను కోరారు. క్రిస్టెల్లా స్పందిస్తూ.. స్విస్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామన్నారు.
ఏపీ పట్ల దిగ్గజ కంపెనీల ఆసక్తి..
అపోలో టైర్స్ వైస్ చైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ కన్వర్, ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) న్యూ ఎకానమీ ఆపరేషన్స్ హెడ్ శ్రీరాం గుత్తా, హైన్‌కెన్ సంస్థ సీఈవో డెన్ బ్రింక్‌లతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కొత్త టైర్ల తయారీ యూనిట్ పెట్టాలని లోకేశ్ కోరగా.. నీరజ్ కన్వర్ సంసిద్ధత వ్యక్తంచేశారు. విద్యారంగానికి గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీకి సాయంపై శ్రీరాం గుత్తా సానుకూలత కనపరిచారు. బీర్ల తయారీ, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు డెన్ బ్రింక్ మొగ్గుచూపారు.
హెస్‌సీఎల్ విస్తరణతో మరో 10 వేల మందికి ఉపాధి: సీఈవో కల్యాణ్
ఆంధ్రప్రదేశ్‌లో హెచ్‌సీఎల్ సేవలను విస్తరించి, మరో 10వేల మందికి ఉపాధి కల్పిస్తామని ఆ సంస్థ సీఈవో కల్యాణ్‌కుమార్ మంత్రి లోకేశ్‌కు స్పష్టం చేశారు. ఏపీలో విస్తరణపై దృష్టి సారించాలని లోకేశ్ కోరగా, ఏపీలో సంస్థ విస్తరణ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.
విశాఖ టెక్‌హబ్‌గా మారనుంది: లోకేశ్
విశాఖపట్నం ఇంటర్నెట్ సీ కేబుల్స్‌తోపాటు డేటా సెంటర్లు, ఏఐ, ఇతర డీప్‌టెక్ వెంచర్లతో విశాఖపట్నం కొత్త టెక్నాలజీ హబ్‌గా మారనుందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. దావోస్‌లో ఏఐ ఎనర్జీ ఇంపాక్ట్ సదస్సులో ఆయన మాట్లాడారు. భారతదేశంలో ఏఐ మార్కెట్ 2030 నాటికి 28.3 బిలియన్ డాలర్లకు పెరుగుతుందన్నారు. ఏఐ ప్రాధాన్యతను గుర్తించిన ఏపీ 7వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పాఠ్యాంశాల్లో ఏఐని ప్రవేశపెట్టాలని నిర్ణయించిందన్నారు. దేశంలోనే తొలి ఏఐవర్సిటీ ఏపీలో ఏర్పాటు చేయనున్నట్లు లోకేశ్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Fog Effect: గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావలసిన పలు విమానాలు ఆలస్యం
Lokesh Visit Davos: అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయండి: మంత్రి లోకేష్
Read Latest AP News And Telugu News