Share News

Kurnool Bus Accident: బస్సు ప్రమాదంపై అన్ని కోణాల్లో విచారణ: అనిత

ABN , Publish Date - Oct 24 , 2025 | 03:06 PM

కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారని తెలిపారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్ పోలీసుల కస్టడీలో ఉన్నారని.. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.

Kurnool Bus Accident: బస్సు ప్రమాదంపై అన్ని కోణాల్లో విచారణ: అనిత
Kurnool Bus Accident

కర్నూలు, అక్టోబర్ 24: ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేసింది. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందజేయాలని ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. బస్సు ప్రమాద ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) వివరాలు వెల్లడించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో 17 మంది పెద్ద వాళ్లు … ఇద్దరు చిన్నపిల్లలు చనిపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.


చనిపోయిన వారిలో ఆరుగురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు ఉన్నారని తెలిపారు. మొత్తం 39 మంది ప్రయాణికులు ఉన్నారని.. అరంఘర్ చౌరస్తాలో ఇద్దరు బస్సు ఎక్కి తర్వాత ఒకరు దిగిపోయినట్లు చెప్పారు. ఘటన జరిగిన వెంటనే పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారని తెలిపారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్ పోలీసుల కస్టడీలో ఉన్నారని.. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు. బాడీలు గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయన్నారు. పది బృందాలు డీఎన్‌ఏ పరీక్షలు చేస్తున్నాయని తెలిపారు. అన్ని కోణాల్లో బస్సు ప్రమాద ఘటనను విచారిస్తున్నామని చెప్పారు. బస్సు ప్రమాదంపై హై పవర్ కమిటీ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నివేదిక సమర్పిస్తామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.


కాగా.. ఈ ప్రమాదం నుంచి బయటపడి కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పరామర్శించారు. ప్రమాదం ఏ విధంగా జరిగిందనే విషయంపై క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు మంత్రి. బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన వారిలో ఆరుగురు డిశ్చార్జ్ అవగా.. మరో ఐదుగురికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి...

బాలయ్య పేరు ఎత్తే అర్హత నీకుందా?.. జగన్‌పై నుడా చైర్మన్ ఫైర్

మద్యం కుంభకోణం కేసులో నిందితులకు దక్కని ఊరట

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 24 , 2025 | 03:47 PM