YSRCP Protest AP Council: ఛైర్మన్‌కు అవమానం అంటూ వైసీపీ సభ్యుల ఆందోళన
ABN , Publish Date - Sep 26 , 2025 | 02:49 PM
మండలి ఛైర్మన్‌ను తరచూ అగౌరవ పరుస్తున్నారని.. అసెంబ్లీ ప్రాంగణంలో క్యాంటీన్ భవనం ప్రారంభోత్సవంలో మండలి ఛైర్మన్ పేరు పెట్టలేదని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
అమరావతి, సెప్టెంబర్ 26: వైసీపీ ఎమ్మెల్సీ(YSRCP MLCs)ల ఆందోళనతో శాసనమండలిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజును అవమానపరుస్తున్నారంటూ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. వి వాంట్ జస్టిస్ అంటూ పోడియం ముందుకు వెళ్లి నిరసన తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు వైసీపీ సభ్యులు. ఈ సందర్భంగా విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... మండలి ఛైర్మన్‌ను తరచూ అగౌరవ పరుస్తున్నారని.. అసెంబ్లీ ప్రాంగణంలో క్యాంటీన్ భవనం ప్రారంభోత్సవంలో మండలి ఛైర్మన్ పేరు పెట్టలేదని మండిపడ్డారు.
ప్రారంభోత్సవానికి రావాలని మండలి ఛైర్మన్‌ను కనీసం పిలువలేదన్నారు. ఇక్కడ వ్యవస్థ ముఖ్యమని.. వ్యక్తులు ముఖ్యం కాదని పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన మహిళా సదస్సుకు కూడా మండలి ఛైర్మన్‌కు ఆహ్వానం లేదన్నారు. సభా నాయకుడైన సీఎం సభకు వచ్చి జరిగిన పరిణామాలపై సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు.
చర్చపై మండలి ఛైర్మన్..
అయితే ఈ చర్చపై మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అభ్యంతరం తెలిపారు. తాను ఛైర్మన్ సీట్లో ఉండగా.. తనపై చర్చ జరపడం ఇష్టం లేదన్నారు. ఛైర్మన్ స్థానంలో ప్యానల్ స్పీకర్‌ను కూర్చోబెడతానని.. అప్పుడు మాట్లాడాలని ఆయన అన్నారు.
కారణాలు తెలుసుకుంటాం: మంత్రి అచ్చెన్న
వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళనతో ఈ అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. చట్ట సభలపై తమకు అపార గౌరవం ఉందన్నారు. మండలి ఛైర్మన్‌ను అవమానించారనడం సరైంది కాదన్నారు. ఆహ్వాన పత్రికలో మండలి ఛైర్మన్ పేరు లేకపోవడానికి కారణాలు తెలుసుకుంటామని చెప్పారు. సభలో జరిగే అంశాలకు సీఎం చంద్రబాబుకు సంబంధం లేదని స్పష్టం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. అయితే సభలో వైసీపీ ఎమ్మెల్సీలు తమ ఆందోళనను కొనసాగించడంతో ఛైర్మన్ సభను కాసేపు వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి..
మండలిలో అచ్చెన్న, బొత్స మధ్య మాటల యుద్ధం
జీఎస్టీలో విప్లవాత్మక మార్పు.. ప్రజలకు ఎంతో మేలు: మంత్రి పయ్యావుల
Read latest AP News And Telugu News