Yarlagadda Venkatrao: వైసీపీవి పిచ్చి ప్రేలాపనలు: ఎమ్మెల్యే యార్లగడ్డ
ABN , Publish Date - Dec 11 , 2025 | 04:00 PM
అంతర్జాతీయ కంపెనీల యజమానులతో లోకేష్ సమావేశం కావడం జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు కేవలం ఈర్ష్యతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు మండిపడ్డారు. లోకేష్ తన వ్యక్తిగత పర్యటనలకు సొంత నిధులు వాడుతున్నారు తప్ప, ప్రభుత్వ డబ్బు వాడుకోవడం లేదని తెలిపారు.
అమరావతి, డిసెంబర్ 11: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యం రివ్యూ మీటింగ్‌లు పెడుతూ రాష్ట్రాన్ని రావణ కాష్టం నుంచి గట్టెక్కించి మళ్లీ గాడిలో పెట్టడానికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖలో దాదాపు 10 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి వారి కెరీర్‌కు భరోసా ఇచ్చారన్నారు. మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో చెప్పినట్లుగా 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. గత అమెరికా పర్యటనలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఒక్క రోజు మాత్రమే చేసి మిగతా రోజుల్లో పరిశ్రమల కోసమే కృషి చేశారని చెప్పుకొచ్చారు.
లోకేష్ ఇటీవల మూడు రోజుల్లోనే గూగుల్, NVIDIA, ఆడోబ్, ఇన్‌టెల్, ఓపెన్ ఏఐ సహా దాదాపు 18 ప్రపంచ దిగ్గజ కంపెనీల సీఈఓలతో సమావేశమై పెట్టుబడుల కోసం రాష్ట్రానికి ఆహ్వానించారన్నారు. భారత జీడీపీ ($4.19 ట్రిలియన్) కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ ($4.6 ట్రిలియన్) ఉన్న NVIDIA కంపెనీతో కూడా చర్చలు జరుపుతున్నారని తెలిపారు. అంతర్జాతీయ కంపెనీల యజమానులతో లోకేష్ సమావేశం కావడం జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు కేవలం ఈర్ష్యతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు.
మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఆ నగరాన్ని నేడు ₹2 లక్షల 90 వేల కోట్ల ఐటీ ఎగుమతులు చేసేలా చేసింది చంద్రబాబు నాయుడు కాదా అని ప్రశ్నించారు. ఆయనే స్ఫూర్తితో లోకేష్ బాబు గూగుల్‌ను వైజాగ్‌కు తీసుకొచ్చి ఆ నగరాన్ని పెట్టుబడుల స్వర్గధామం చేయబోతున్నారని అన్నారు. వైసీపీ మంత్రులు తమ హయాంలో ఎన్నిసార్లు రివ్యూ మీటింగ్‌లు పెట్టారో గణాంకాలతో చర్చకు రావాలని సవాల్ చేశారు. లోకేష్ బాబు తన వ్యక్తిగత పర్యటనలకు సొంత నిధులు వాడుతున్నారు తప్ప, ప్రభుత్వ డబ్బు వాడుకోవడం లేదని తెలిపారు. లోకేష్ ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేశారని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు. ఓటమి తర్వాత కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయి ఏడాది పాటు గుడివాడ మొహం చూడకుండా దాక్కున్న నాయకుడు ప్రజాతీర్పును గౌరవించలేదంటూ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ కేబినెట్.. రూ.9,500 కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
మీరు పరిష్కరించాల్సినవి నా దృష్టికి తెస్తే ఎలా?.. మంత్రులకు సీఎం ప్రశ్న
Read Latest AP News And Telugu News