Share News

CM Chandrababu: మీరు పరిష్కరించాల్సినవి నా దృష్టికి తెస్తే ఎలా?.. మంత్రులకు సీఎం ప్రశ్న

ABN , Publish Date - Dec 11 , 2025 | 03:06 PM

ఏపీ కేబినెట్ సమావేశంలో భాగంగా పలు అంశాలపై చర్చ జరిగింది. జగనన్న కాలనీలో గృహాలు నిర్మించని లబ్ధిదారుల పట్టాలు రద్దు చేయాలని పలువురు మంత్రులు కోరారు. చాలా ప్రాంతాల్లో ఇల్లు నిర్మించకుండా వృధాగా ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

CM Chandrababu: మీరు పరిష్కరించాల్సినవి నా దృష్టికి తెస్తే ఎలా?.. మంత్రులకు సీఎం ప్రశ్న
CM Chandrababu

అమరావతి, డిసెంబర్ 11: ఏపీ కేబినెట్ సమావేశం ఈరోజు (గురువారం) జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం పలు అంశాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో భూ కేటాయింపులు, రెవెన్యూ సమస్యలపై జిల్లాలో సమీక్షించాలని ఇంచార్జి మంత్రులను సీఎం ఆదేశించారు. మంత్రులు పరిష్కరించాల్సిన పనులను తమ దృష్టికి తీసుకొస్తే ఎలా సీఎం ప్రశ్నించారు. ఇక చేనేతలకు ఉచిత విద్యుత్ అంశాన్ని ఆర్థిక శాఖ పెండింగ్‌లో ఉంచడంపై పలువురు మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు.


సూర్యఘర్‌తో అనుసంధానం చేశారని మంత్రులు చెప్పారు. అయితే సూర్యఘర్‌తో సంబంధం లేకుండా చూడాలని... దీనిని వెంటనే అమలు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా జగనన్న కాలనీలో గృహాలు నిర్మించని లబ్ధిదారుల పట్టాలు రద్దు చేయాలని పలువురు మంత్రులు కోరారు. చాలా ప్రాంతాల్లో ఇల్లు నిర్మించకుండా వృధాగా ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇప్పటికే లబ్ధిదారుల పేరిట స్థలాలు రిజిస్టర్ అయి ఉన్నాయని మరికొంతమంది మంత్రులు చెప్పారు. పట్టాలు రద్దు చేయడం సాధ్యం కాదని సీఎం దృష్టికి మంత్రి అచ్చెన్నాయుడు తీసుకెళ్లగా.. ఇది నిజమేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా తెలిపారు.


దీనిపై మంత్రులు కూర్చొని ఆలోచించాలని ముఖ్యమంత్రి సూచించారు. లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చి ఇల్లు నిర్మిస్తారా? లేదా? అనేది తెలుసుకోవాలన్నారు. ఒకవేళ ఇల్లు కట్టుకోకపోతే కొత్త లబ్ధిదారులకు మూడు సెంట్లు ఇవ్వాలని గతంలో చెప్పిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. అలాగే రెవెన్యూ సమస్యలన్నీ కూడా ఏడాదిలోగా పరిష్కరించాలని సీనియర్ ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.


ఇవి కూడా చదవండి...

సుప్రీం ఆదేశం.. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్

ఏపీ కేబినెట్.. రూ.9,500 కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 11 , 2025 | 03:24 PM