Pinnelli Brothers Surrender: సుప్రీం ఆదేశం.. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:29 AM
జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు. సుప్రీం ఆదేశాల మేరకు పిన్నెల్లి బ్రదర్స్ కోర్టులో సరెండర్ అయ్యారు.
పల్నాడు జిల్లా, డిసెంబర్ 11: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy), అతడి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి (Pinnelli Venkatarami Reddy) మాచర్ల కోర్టులో లొంగిపోయారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో A6 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , A7 పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి రెండు వారాల్లో లొంగిపోవాలంటూ పిన్నెల్లి సోదరులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేటితో సుప్రీం కోర్టు గడువు ముగియడంతో ఈరోజు (గురువారం) ఉదయం మాచర్ల జూనియర్ సివిల్ కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోయారు.
ఈ ఏడాది మే 24న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన అన్నదమ్ములు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావులు దారుణ హత్యకు గురయ్యారు. తెలంగాణలోని బంధవుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న బైక్‌ను కారుతో ఢీకొట్టి కింద పడిన ఇద్దరినీ బండరాళ్లతో కొట్టి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ జంట హత్యల కేసులో మొత్తం 9 మందిని నిందితులుగా చేర్చారు. వారిలో ఏ6గా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.
అయితే తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టును పిన్నెల్లి సోదరులు ఆశ్రయించారు. హైకోర్టులో పిన్నెల్లి బ్రదర్స్‌కు చుక్కెదురవడంతో సుప్రీంలో పిటిషన్ వేశారు. దీంతో కొద్దిరోజుల పాటు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది సుప్రీం కోర్టు. ఈ కేసు విచారణలో భాగంగా ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. నిందితులు విచారణకు సహకరించడం లేదని, సాక్షులను బెదిరిస్తున్నారంటూ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న సుప్రీం పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేయడంతో పాటు వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. అయితే రెండు వారాల పాటు సమయం ఇవ్వాలని పిన్నెల్లి తరఫున న్యాయవాది కోరారు. ఈ క్రమంలో పిన్నెల్లి సోదరులు లొంగపోయేందుకు రెండు వారాల పాటు సుప్రీం కోర్టు గడువు ఇచ్చింది. సుప్రీం ఆదేశాల మేరకు లొంగిపోయేందుకు నిర్ణయం తీసుకున్న పిన్నెల్లి సోదరులు ఈరోజు మాచర్ల కోర్టులో సరెండర్ అయ్యారు.
ఇవి కూడా చదవండి...
టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిడతల రామ భూపాల్ రెడ్డి మృతి
ఇంద్రకీలాద్రిలో భవాని దీక్ష విరమణలు ప్రారంభం.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ
Read Latest AP News And Telugu News