Vijayawada Swachh Andhra: స్వచ్ఛతాహి మారథాన్.. పరుగులు తీసిన యువత..
ABN , Publish Date - Oct 02 , 2025 | 03:42 PM
విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛతాహి మారథాన్ కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్, హీరో శర్వానంద్ జెండా ఊపి ప్రారంభించారు. దేశం నలుమూలల నుంచి వందలాది మంది క్రీడాకారులు, యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని నగర వీధుల్లో పరుగులు తీశారు.
విజయవాడ: ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో “స్వచ్ఛతాహి 10కే మారథాన్” ఇవాళ (గురువారం) ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, శుభ్రత ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో చేపట్టిన ఈ మారథాన్ విజయవాడ ఉత్సవ్-2025లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి సినీ హీరో శర్వానంద్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్, హీరో శర్వానంద్ జెండా ఊపి ప్రారంభించారు. దేశం నలుమూలల నుంచి వందలాది మంది క్రీడాకారులు, యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని నగర వీధుల్లో పరుగులు తీశారు. అనంతరం విజేతలుగా నిలిచిన వారికి నిర్వాహకులు పతకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. విజయవాడ ప్రజలు శుభ్రతలో ఆదర్శంగా నిలవాలని సూచించారు. యువత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నినాదంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేపట్టిన ఈ కార్యక్రమానికి 11 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారని ఎంపీ కేశినేని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి సమర్థవంతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో 11 రోజులుగా 5 వేదికలపై జరుగుతున్న కార్యక్రమాలు భక్తులతోపాటు నగరవాసులు ఆస్వాదించారని ఎంపీ కేశినేని స్పష్టం చేశారు.

విజయవాడతో ఎనలేని అనుబంధం: శర్వానంద్
అనంతరం హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. విజయవాడతో తనకు ఎనలేని అనుబంధం ఉందని, తాను ఇక్కడే పుట్టి పెరిగానని తెలిపారు. విజయవాడతో తనకున్న అనుబంధాన్ని శర్వానంద్ నెమరు వేసుకున్నారు. వచ్చే దసరాకి స్వచ్ఛతా మారథాన్ కార్యక్రమంలో పాల్గొని విజయవాడ వీధుల్లో పరుగులు తీస్తానని ప్రకటించారు. ఈ మేరకు విజయవాడ నగరవాసులకు, తన అభిమానులకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.



ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధర తగ్గేదేలే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
టాప్ ప్లేస్‌లో అంబానీ.. దేశంలో అత్యంత సంపన్నులు వీరే..