New Year Celebrations: హద్దు మీరితే చర్యలు తప్పవు: నగర సీపీ
ABN , Publish Date - Dec 29 , 2025 | 08:16 AM
కొత్త సంవత్సరం వేడుకలు సందర్భంగా నగరంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలను అతిక్రమిస్తే.. చర్యలు తప్పవని నగర సీపీ రాజశేఖర్ బాబు హెచ్చరించారు.
విజయవాడ, డిసెంబర్ 29: కొత్త సంవత్సర వేడుకలు సందర్భంగా నగరంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవాడ నగర పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి జరగనున్న న్యూ ఇయర్ వేడుకలపై పలు ఆంక్షలు విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు. జనవరి 13వ తేదీ వరకు రాత్రి వేళల్లో అన్ని ఫ్లైఓవర్లు, ముఖ్యమైన రహదారులు మూసివేస్తున్నట్లు తెలిపారు. రహదారులపై అర్థరాత్రి న్యూఇయర్ వేడుకల నిర్వహణను నిషేధించినట్లు చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బెంజ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లై ఓవర్లను రాత్రి వేళల్లో పూర్తిగా మూసివేస్తామని ప్రకటించారు. గ్రూపులుగా చేరి.. రహదారులపై కేక్ కట్ చేయడాన్ని నిషేధించినట్లు వివరించారు. ఎవరైనా హద్దులు దాటి వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. వాహనాల సైలెన్సర్లు తీసి నడిపే వారిపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. అర్థరాత్రి నుంచి నగర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు.
డిసెంబర్ 31వ తేదీ రాత్రి వేళ నగరంలో గస్తీ ముమ్మరంగా ఉంటుందని.. మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. బైక్ విన్యాసాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. ఆర్థరాత్రి వేళ.. బాణాసంచా పేల్చడం వంటివి చేయవద్దని ముఖ్యంగా యువతకు ఆయన సూచించారు.
ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకలు సందర్బంగా యువత వేగంగా బైక్‌లు నడపడం, అజాగ్రత్తగా వ్యవహరించడంతోపాటు త్రీబుల్ రైడింగ్ వల్ల పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఆంక్షలు విధించారు. రాష్ట్రంలోని వివిధ నగరాల్లో సైతం ఈ తరహా చర్యలను పోలీస్ ఉన్నతాధికారులు అమలు చేయనున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
అందుకే బోగీలో మంటలు వచ్చాయి: ఎస్పీ తుహీన్ సిన్హా
మ్యూచువల్ ఫండ్స్ లాభాలపై పన్ను పోటు ఎంత
For AP News and Telugu News