Vijayawada Durga Temple: ముగియనున్న కార్తీకం.. దుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్
ABN , Publish Date - Nov 11 , 2025 | 10:07 PM
పవిత్ర కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని శ్రీదుర్గమ్మ ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
విజయవాడ, నవంబర్ 11: కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైన శ్రీదుర్గమ్మ వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నవంబర్ 14 నుంచి 16వ తేదీ వరకు అంటే మూడు రోజుల పాటు అమ్మ వారి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు కార్తీక మాసం వన సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దాంతో ప్రత్యేక దర్శనం కోసం ఏర్పాటు చేసిన రూ. 500 టిక్కెట్ల విక్రయాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా ఈ మూడు రోజులు.. అంటే 14, 15, 16 తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు రూ. 500 టికెట్ల విక్రయాన్ని నిలిపి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అలాగే ఈ మూడు రోజులపాటు అంతరాలయ దర్శనానికి ఎటువంటి వీఐపీ సిఫార్సు లేఖలు అనుమతింమని స్పష్టం చేశారు. ఈ రోజుల్లో ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల మధ్య భక్తులందరికీ "బంగారు వాకిలి" ద్వారా అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీహార్ NDA హవా.. సర్వేలన్నీ నితీష్ కుమార్ వైపే.!
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News