CM Chandrababu: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 11 , 2025 | 09:20 PM
తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ నగదు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ చేసి చూపించామని చెప్పారు. ఆర్ధిక ఇబ్బందులు ఉండటం వల్ల కొన్ని పనులు కొంత ఆలస్యం అవుతున్నాయని వివరించారు.
విజయవాడ, నవంబర్ 11: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తానుంటే క్షేమంగా ఉంటామనే నమ్మకంతో తనకు ప్రజలు ఓట్లు వేశారని ఆయన తెలిపారు. మంగళవారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినం సందర్భంగా మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. పెన్షన్‌లు రూ. 4 వేలు, రూ. 6 వేలు, రూ. 15 వేలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం మనదేనని ఆయన స్పష్టం చేశారు.
తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ నగదు ఇస్తున్నామన్నారు. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ చేసి చూపించామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల కొన్ని పనులు కొంత ఆలస్యం అవుతున్నాయని వివరించారు. ఇంత అనుభవం ఉన్నా తనకే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతుబట్టడం లేదన్నారు. అయితే తనకు భయం లేదని.. అయిన ముందుకు సాగుతానని సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. కేర్ ఫుల్‌గా డ్రైవ్ చేసే వ్యక్తిని కాబట్టి.. సురక్షితంగా ఒడ్డుకు తీసుకెళ్తానని భరోసా ఇస్తున్నానని పేర్కొన్నారు. తాను సైతం రాత్రింబవళ్లు పని చేస్తున్నానన్నారు.
సంక్షేమం, అభివృద్ధిని సమానంగా తీసుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఏపీకి రూ. 10 లక్షల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. విశాఖపట్నం వేదికగా జరగనున్న భాగస్వామ్య సదస్సు ద్వారా మరో రూ. 10 లక్షల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. గూగుల్ ద్వారా రూ. లక్షా 25 వేల కోట్లు రానున్నాయని.. వాటిని ఐదేళ్లలో విశాఖపట్నంలో ఖర్చు పెట్టబోతున్నామన్నారు. కేంద్రం నగదు ఇస్తే.. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. వారి చేతకాని పాలనతో.. కోట్లాది రూపాయల నిధులు కేంద్రం వద్ద ఆగిపోయాయన్నారు. వాటన్నింటినీ మళ్లీ సరిచేసి అమలు చేస్తామని ఈ సందర్భంగా ప్రజలకు సీఎం చంద్రబాబు హమీ ఇచ్చారు.
ఏపీకి ఉన్న బ్రాండ్‌ను అంతా భ్రష్టు పట్టించారంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ అందరిలో నమ్మకం కల్గించి..పెట్టుబడిదారులను తీసుకువస్తున్నామన్నారు. ఎవరైనా అసంతృప్తితో ఉంటే.. అందుకు కారణం తెలుసుకుని సమస్యను పరిష్కరిస్తున్నానన్నారు. కష్టపడి పని చేయకండి.. ఇష్టపడి పని చేయండంటూ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు సూచించారు. తాను ఉద్యోగులకు అండగా ఉంటానని.. అందరం కలిసి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. భగవంతుడు తనకు అన్ని అవకాశాలు ఇచ్చాడని.. తాను ప్రజల కోసమే పని చేస్తున్నానని పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం తాను సీఎంగా ఉన్నానంటే.. అది ప్రజల ఆదరణ, అభిమానమే కారణమన్నారు. శాశ్వతంగా మీ వాడిగా ఉంటాను.. అన్ని విషయాల్లో తోడుగా ఉంటానని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు.
భారత దేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. మైనార్టీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా సయ్యద్ నషీద్ అహ్మద్‌ను లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారంతో సీఎం చంద్రబాబు సత్కరించారు. అలాగే ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని ఆయన సన్మానించారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవాన్ని నేడు మనం జరుపుకుంటున్నామన్నారు. ఈ రెండూ చూస్తే ఒక చరిత్ర అని..మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు మనమంతా నివాళి అర్పించాలన్నారు.
దేశంలో నేడు నాలెడ్జ్ ఎకానమీ వచ్చిందంటే.. అందుకు నాందీ పలికిన వ్యక్తి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ అని గుర్తు చేశారు. 1951లో దేశంలో తొలి ఐఐటీ స్థాపించిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని చెప్పారు. అలాంటి మహనీయులను మనమంతా స్పూర్తిగా తీసుకోవాలన్నారు. అబ్దుల్ కలాం రాష్ట్రపతి కావడానికి తాను ఆ రోజు సహకరించానని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. తాను మైనారిటీల అభివృద్దికి కృషి చేస్తానని.. మీకు అండగా ఉంటానని వారికి సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మైనార్టీల కోసం చేసిన సంక్షేమాన్ని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సోదాహరణగా వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీహార్ NDA హవా.. సర్వేలన్నీ నితీష్ కుమార్ వైపే.!
సీఎంతో కేంద్ర మంత్రి భేటీ.. మొంథా తుఫాన్‌పై చర్చ
Read Latest AP News And Telugu News