CM Chandrababu: సీఎంతో కేంద్ర మంత్రి భేటీ.. మొంథా తుఫాన్‌పై చర్చ
ABN , Publish Date - Nov 11 , 2025 | 07:13 PM
మొంథా తుపాన్ వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టాన్నికేంద్ర మంత్రి చౌహన్‌కు సీఎం చంద్రబాబు వివరించారు. ఇక మైనర్ ఇరిగేషన్ కింద సాగు చేసే రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం సహకారించాలని ఆయనకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
అమరావతి, నవంబర్ 11: ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, పీడీఎంసీ స్కీం కింద ఆంధ్రప్రదేశ్‌కి అదనపు నిధులు కేటాయించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. మంగళవారం అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దాదాపు గంటపాటు వీరి సమావేశమైయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయం, మైనర్ ఇరిగేషన్ తదితర అంశాలపై వీరిరువురు చర్చించారు.
మొంథా తుపాన్ వల్ల జరిగిన నష్టాన్నికేంద్ర మంత్రి చౌహన్‌కు సీఎం చంద్రబాబు వివరించారు. ఇక మైనర్ ఇరిగేషన్ కింద సాగు చేసే రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం సహకారించాలని చౌహన్‌ను సీఎం చంద్రబాబు కోరారు. 2024-25, 2025-26 ఆర్ధిక సంవత్సరాలకు కలిపి మొత్తం రూ.695 కోట్లు ఇవ్వాలని ఆయనను సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద తోతాపూరి రైతులకు ఇచ్చిన మద్దతు ధరలో కేంద్ర ప్రభుత్వ వాటాను సైతం విడుదల చేయాలన్నారు. ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఇవ్వాల్సిన రూ.100 కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రిని సీఎం చంద్రబాబు కోరారు. గుంటూరు పర్యటనకు వచ్చిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్.. అమరావతిలోని క్యాంప్ కార్యాలయానికి వచ్చారు.
గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పర్యటించారు. నల్లపాడు లయోలా స్కూల్‌లో ఆయన పైలాన్ ఆవిష్కరించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా వెంగళాయపాలెం చెరువు వద్ద రూ. 1.20 కోట్లతో చేసిన అభివృద్ధి పనులని శివరాజ్ సింగ్ చౌహన్ పరిశీలించారు. అనంతరం వెంగళాయపాలెం చెరువును కేంద్ర మంత్రి చౌహన్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. పురాతన వెంగళాయపాలెం చెరువుని అత్యాదునికంగా పునరుద్ధరించారన్నారు. వెంగళాయపాలెం చెరువు ద్వారా ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగాయని వివరించారు.
వెంగళాయపాలెం చెరువు ద్వారా పశువులకు తాగునీరు లభిస్తుందని పేర్కొన్నారు. మత్స్య సంపద పెంచడానికి, బోటింగ్ సౌకర్యానికి ఈ చెరువుని వినియోగించుకోవచ్చని సూచించారు. వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, ఓపెన్ థియేటర్.. ప్రజలకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్ చౌహన్‌తో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, మహ్మద్ నజీర్, గల్లా మాధవితోపాటు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించింది. ఈ సందర్భంగా ఈ తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. అనంతరం మంగళవారం అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసి.. జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం సోదాహరణగా వివరించింది.
ఇవి కూడా చదవండి..
జూబ్లీహిల్స్‌లో ముగిసిన ఉప ఎన్నిక పోలింగ్..
మొంథా తుపాన్‌పై సీఎంను కలిసిన కేంద్ర బృందం
Read Latest AP News And Telugu News