Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో ముగిసిన ఉప ఎన్నిక పోలింగ్..
ABN , Publish Date - Nov 11 , 2025 | 06:08 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. మంగళవారం సాయంత్రం 6.00 గంటలకు ఈ పోలింగ్ సమయం ముగిసింది.
హైదరాబాద్, నవంబర్ 11: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. మంగళవారం సాయంత్రం 6.00 గంటలకు ఈ పోలింగ్ సమయం ముగిసింది. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్‌లో ఉన్న ఓటర్లకు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇక సాయంత్రం 5.00 గంటల వరకు 47.16 శాతం పోలింగ్ నమోదు అయిందని అధికారులు తెలిపారు.
మరోవైపు.. యూసుఫ్‌గూడ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొలంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పరస్పరం ఇరు పార్టీల శ్రేణులు ఆరోపణలు చేసుకున్నాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. అయితే కాంగ్రెస్ శ్రేణులు దొంగఓట్లు వేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత ధర్నాకు దిగారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు జరిపారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది నవంబర్ 14వ తేదీన ఓట్ల లెక్కింపు ద్వారా వెల్లడికానుంది.
ఇక ఉప ఎన్నిక పోలింగ్ వేళ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. దాంతో ఆ ఎమ్మెల్యేలపై ఈసీ కేసులు నమోదు చేసింది. ఇక పోలింగ్ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరును ఆమె ఎండగట్టారు. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయ్ యాదవ్ సోదరుడు తనను బెదిరించారని మాగంటి సునీత ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలింగ్ సమయంలో మాగంటి సునీత ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించారంటూ ఈసీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.