Dasara Navaratri 2025: భిన్నంగా విజయవాడ దసరా వేడుకలు.. సెప్టెంబర్ 22 నుంచి
ABN , Publish Date - Sep 20 , 2025 | 03:14 PM
ఈ నెల 22 నుండి వచ్చే నెల 2 వరకు నవరాత్రులు జరుగనున్నాయి. ఈ ఏడాది 11 అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
విజయవాడ, సెప్టెంబర్ 20: ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఎల్లుండి (సోమవారం) నుంచి దసరా నవరాత్రులు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 2 వరకు నవరాత్రులు జరుగనున్నాయి. ఈ ఏడాది 11 అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 22న మొదటి రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి దర్శనాలను ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో శినా నాయక్ మాట్లాడుతూ.. ఎప్పటి కంటే భిన్నంగా దసరా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూలా నక్షత్రం రోజు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని.. మూలా నక్షత్రం రోజు అన్ని ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేశామని వెల్లడించారు. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నదానం జరుగుతుందని ఈవో శినా నాయక్ పేర్కొన్నారు.
సామాన్య భక్తులకు పెద్దపీట: కలెక్టర్ లక్ష్మీ షా
పక్క ప్లాన్‌తో దసరా ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. వీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలు స్లాట్ ప్రకారం రావాలని కోరారు. వీవీఐపీ దర్శన సమయాలు ఉదయం 7 నుంచి 9 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు ఉంటాయని.. సాయంత్రం 4 నుంచి 5 వరకు వృద్ధులు అమ్మవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి రెఫరల్ దర్శనాలు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు. మొత్తం 35 సెక్టార్స్ చేశామని.. ప్రతి చోట భక్తుల నుంచి క్యూ ఆర్ కోడ్ ద్వారా అభిప్రాయం తీసుకుంటామన్నారు. హోల్డింగ్ పాయింట్స్ పెంచామని.. 20 పార్కింగ్ ఏరియాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రి మొత్తం టెక్నాలజీ అనుసంధానం చేశామని కలెక్టర్ లక్ష్మీ వెల్లడించారు.
అందరూ సహకరించండి: సీపీ రాజశేఖర్ బాబు
అన్ని శాఖలు సమన్వయంతో దసరా పనులు చేస్తున్నామని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా జాగ్రతలు తీసుకుంటున్నామని.. దసరా నవరాత్రి ఉత్సవాల్లో అందరూ సహకరించాలని సీపీ రాజశేఖర్ బాబు కోరారు.
ఇవి కూడా చదవండి
ఆ సీట్లు అమ్ముకున్నది మీరా మేమా.. జగన్‌పై నజీర్ మండిపాటు
చలో మెడికల్ కాలేజ్...పోలీసుల వైఖరి.. పేర్నినాని రియాక్షన్
Read Latest AP News And Telugu News