Vangalapudi Anitha: భవానీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు: హోం మంత్రి
ABN , Publish Date - Dec 09 , 2025 | 07:12 PM
ఈ ఏడాది దాదాపు 6 లక్షల మందికిపైగా భవానీలు ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మను దర్శించుకోనున్నారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తోంది.
విజయవాడ, డిసెంబర్ 09: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీదుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భవానీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మంగళవారం ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణల ఏర్పాట్లను దేవస్థానం ఉన్నతాధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. అనంతరం హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. డిసెంబర్ 11వ తేదీన భవానీ భక్తుల దీక్ష విరమణ ప్రారంభమవుతుందన్నారు. ఇవి 15వ తేదీ వరకు జరుగుతాయని వివరించారు.
ఈ ఏడాది దాదాపు 6 లక్షల మందికి పైగా భవానీలు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ 9 కిలోమీటర్లు మేర గిరి ప్రదక్షిణ అనంతరం దుర్గమ్మను భవానీలు దర్శించుకుంటారని చెప్పారు. భవానీల రాక సందర్భంగా డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై వీఐపీ, వీవీఐపీ దర్శనాలు రద్దు చేసినట్లు వెల్లడించారు.
అలాగే భవానీ భక్తులు కోసం మూడు హోమగుండాలను ఏర్పాటు చేశామన్నారు. క్యూ లైన్లలో ఉండే భక్తులకు పాలు, బిస్కెట్లు, మజ్జిగ, మంచినీళ్ల బాటిల్స్ అందిస్తామన్నారు. చిన్న పిల్లలు తప్పిపోకుండా వారి చేతికి స్కానర్ ట్యాగ్ పెడుతున్నట్లు చెప్పారు. దాదాపు 60 లక్షల లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. అలాగే భక్తులకు నిత్య అన్నదానం జరుగుతుందని తెలిపారు. శానిటేషన్ సిబ్బందిని అన్ని ప్రాంతాల్లోని దేవాలయాల వద్ద ఏర్పాటు చేశామన్నారు. భవాని భక్తులు స్నానాలు ఆచరించడానికి నదీ ఘాట్‌లలో జల్లు స్నానాలు ఏర్పాటు చేశామని మంత్రి అనిత వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం
తెలంగాణలో స్కూళ్లకు 6 రోజులపాటు సెలవు.. ఎందుకంటే?
For More AP News And Telugu News