Share News

Vijayawada Baby Trafficking: బెజవాడలో అమానుషం.. నెలల వయస్సున్న శిశువుల విక్రయం

ABN , Publish Date - Dec 18 , 2025 | 09:56 AM

విజయవాడలో పసిబిడ్డల విక్రయం ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నెలల వయస్సు పసిబిడ్డలను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Vijayawada Baby Trafficking: బెజవాడలో అమానుషం.. నెలల వయస్సున్న శిశువుల విక్రయం
Vijayawada

విజయవాడ, డిసెంబర్ 18: బెజవాడలో పసిబిడ్డల విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, యూపీ ఇతర రాష్ట్రాల నుంచి నెలల వయసున్న పిల్లలను తీసుకువచ్చి ఈ ముఠా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎంతో చాకచక్యంగా ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి వద్ద నుంచి ఐదుగురు శిశువులను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో శిశువును రూ.3 నుంచి రూ.5 లక్షలకు అమ్ముతున్నట్లు విచారణలో బయటపడింది. గతంలో అరెస్ట్ చేసిన బండి సరోజ ముఠానే ఆ శిశువుల అక్రమ అమ్మకాలు చేస్తున్నట్టు గుర్తించారు.


3 నెలల క్రితం అరెస్ట్ అయిన సరోజ ముఠా కొద్దిరోజుల క్రితమే బయటకు వచ్చింది. జైలుకు వెళ్లినా బుద్ధిమార్చుకోని ఆ ముఠా సభ్యులు మళ్లీ శిశువులను అమ్ముతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ముఠాలో ఆరుగురు మహిళలు, ఏడుగురు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో విజయవాడ, పాయకాపురం, గుంటూరు, నరసరావు పేట ప్రాంతాల వారు ఉన్నట్టు గుర్తించారు.


ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న ఐదుగురు శిశువులను ఐసీడీఎస్‌కు తరలించారు. అలాగే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా చిన్నపిల్లల విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.


హ్యూమన్ ట్రాఫికింగ్‌పై ఉక్కు పాదం: పోలీస్ కమిషనర్

శిశువులను విక్రయించే ముఠా అరెస్ట్‌పై ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమీషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ.. శిశువులను విక్రయించే ముఠాను పట్టుకుని ఐదుగురు శిశువులను కాపాడినట్లు తెలిపారు. బలగం సరోజ, మరికొందరు మహిళలను అరెస్టు చేసి నాలుగు లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. షేక్ ఫరీన్, సరోజలపై నిఘా ఉంచి పట్టుకున్నట్లు చెప్పారు. టాస్క్ ఫోర్స్ , పోలీసులు జాయింట్ ఆపరేషన్‌తో ఈ ముఠాను అరెస్టు చేశామన్నారు. భవానీపురం‌ పీఎస్‌ పరిధిలో ఐదుగురు, నున్న పీఎస్ పరిధిలో ముగ్గురిని పట్టుకున్నామని తెలిపారు. హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఉక్కు పాదం మోపుతున్నామని స్పష్టం చేశారు.


ఐదుగురిలో ఇద్దరు బాలికలను కిరణ్ శర్మ, భారతి నుంచి ఢిల్లీలో సరోజిని కొనుగోలు చేశారన్నారు. రెండో పాపను బెంగుళూరు నుంచి విజయలక్ష్మి లక్షకు కొనుగోలు చేసిందని.. ఆమె షేక్ బాషావలి అనే వ్యక్తి అప్పగించిందని తెలిపారు. ముంబాయి నుంచే నందిని అనే మహిళ ఒక బాలుడిని కొనుగోలు చేసిందన్నారు. కిరణ్ శర్మ, భారతి నుంచి నాలుగో బేబీని సరోజిని కొనుగోలు చేసిందన్నారు. ఐదో బేబీని సతీష్ నుంచి సరోజినిని కొని.. శ్రీనివాస్, యోహాన్ వరకు చేతులు మార్చిందని వివరించారు. వీరంతా శిశువులను విక్రయించేందుకు ఉండగా పట్టుకున్నామని... ఆ శిశువులను ఎవరికి అమ్ముతారనే అంశాలపై లోతుగా విచారణ చేయాల్సిందన్నారు.


సరోజిని, ఫరీనా గతంలో ఇటువంటి కేసులో అరెస్టు అయ్యారని.. బయటకు వచ్చి మళ్లీ ఇదే పనికి పాల్పడుతున్నారని తెలిపారు. వీరిని ఉపేక్షించేది లేదని... భవానీపురం, టూటౌన్, నున్న పీఎస్‌లలో కేసులు నమోదు చేశామన్నారు. అనేక ప్రాంతాల్లో ఈ ముఠా సభ్యులు ఉన్నారని.. వారందరినీ గుర్తించి అరెస్టు చేస్తామని తెలిపారు. ఏపీ, ముంబాయి, ఢిల్లీ కేంద్రంగా శిశువుల విక్రయించే ఈ ముఠాలు పని చేస్తున్నాయని వెల్లడించారు. శిశువులను విక్రయించే ముఠా వివరాలు తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. వీరు నిజంగా పిల్లలు లేని వారికి విక్రయిస్తున్నారా... లేదా ఇతర ప్రాంతాలకు పంపుతున్నారా అనేది దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అధికారులు లతా కుమారి, వెస్ట్, నార్త్ ఏసీపీ, టాస్క్ ఫోర్స్ సిబ్బందిని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీకి చెందిన కిరణ్, భారితీలను త్వరలోనే పట్టుకుంటామని.. వారు ఎలా శిశువులను తెస్తున్నారో తేలాల్సి ఉందన్నారు. విజయవాడలో ఇటువంటి ముఠాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని పోలీసు కమీషనర్ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

SBI బ్యాంకులో నకిలీ నోట్ల కలకలం..!

భక్తులకు అలర్ట్.. ఇకపై ఆ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 18 , 2025 | 11:41 AM