Narayana On TIDCO Houses: టిడ్కో ఇళ్ల పరిస్థితిపై అసెంబ్లీలో మంత్రి నారాయణ
ABN , Publish Date - Sep 22 , 2025 | 01:35 PM
2014-19లో కేంద్ర ప్రభుత్వం 7,01,481 టిడ్కో ఇళ్లను ఏపీకి కేటాయించిందని మంత్రి నారాయణ గుర్తుచేశారు. వీటిలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పాలనా అనుమతులు తీసుకుని టెండర్లు పిలిచామన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 22: ఏపీ అసెంబ్లీల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల పరిస్థితిపై పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ (Minister Narayana) సమాధానం ఇచ్చారు. వచ్చే జూన్ నెలాఖరులోపు 2,61,640 టిడ్కో ఇళ్లను పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామని తెలిపారు. ఎక్కడైనా పూర్తయిన ఇళ్లను ప్రతి శనివారం లబ్దిదారులకు అప్పగించాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలిచ్చామని అన్నారు. మొత్తం ఇళ్ల నిర్మాణంతో పాటు మౌళిక వసతులకు, కాంట్రాక్టర్ల పెండింగ్ బకాయిలకు కలిపి రూ.7280 కోట్లు అవసరమన్నారు.
ఈ నిధులను హడ్కో ద్వారా, వివిధ బ్యాంకుల నుంచి లోన్‌లు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. 2014-19లో కేంద్ర ప్రభుత్వం 7,01,481 టిడ్కో ఇళ్లను ఏపీకి కేటాయించిందని గుర్తుచేశారు. వీటిలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పాలనా అనుమతులు తీసుకుని టెండర్లు పిలిచామన్నారు. గత ప్రభుత్వం వీటిని 2,61,640 కు తగ్గించడమే కాకుండా...ఇళ్లను కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. అంటే మొత్తంగా 4,39,841 ఇళ్లను రద్దు చేసేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లలో అనేక అవకతవకలకు పాల్పడిందని మంత్రి ఆరోపించారు.
39,520 మంది లబ్దిదారులకు అర్హత లేదని పక్కన పెట్టేసిందన్నారు. ఇళ్లకు పార్టీ రంగులు వేసి కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వలేదని సభలో తెలిపారు. ఇళ్లు ఇవ్వకుండానే లబ్దిదారుల పేరు మీద బ్యాంకు లోన్‌లు తీసుకుందని మండిపడ్డారు. ఈ లోన్‌లు చెల్లించేందుకు ఈ ప్రభుత్వం రూ.140 కోట్లు బ్యాంకులకు చెల్లించిందని మంత్రి నారాయణ సభలో వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ
ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News