TDP MLA Yarlagadda venkatarao: వైఖరి మార్చుకో వైఎస్ జగన్: ఎమ్మెల్యే యార్లగడ్డ
ABN , Publish Date - Sep 01 , 2025 | 02:43 PM
అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానీ వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ మరోసారి నిప్పులు చెరిగారు. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలంటూ వైసీపీ అధినేతతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన హితవు పలికారు.
గన్నవరం, సెప్టెంబర్ 01: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ మరోసారి నిప్పులు చెరిగారు. సోమవారం గన్నవరంలో స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ విలేకర్లతో మాట్లాడుతూ.. నీ వైఖరి మార్చుకోవాలంటూ వైఎస్ జగన్‌కు సూచించారు. అసెంబ్లీకి రాని మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ చరిత్రలో మిగిలిపోతారని ఆయన సందేహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా క్రమం తప్పకుండా అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాంటి చంద్రబాబు నాయుడిని చూసి తన వైఖరి మార్చుకోవాలంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ హితవు పలికారు.
సెప్టెంబర్ 01తో తొలిసారిగా ముఖ్యమంత్రి పదవిని స్వీకరించి.. 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే యార్లగడ్డ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు.. ప్రతిపక్షంలో సైతం15 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా ఆయన అసెంబ్లీకి హాజరయ్యారని ఈ సందర్భంగా వివరించారు. ఎన్నో అవమానాలను సైతం భరిస్తూ.. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించి.. ప్రజల పక్షాన నిలబడ్డారంటూ సీఎం చంద్రబాబు నాయుడును ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ప్రగల్భాలు పలకారని ఎద్దేవా చేశారు. దీంతో ఆయన పాలనతో విసుగెత్తిన ప్రజలు 11 సీట్లకే ఆ పార్టీని పరిమితం చేశారని వ్యంగ్యంగా అన్నారు. వైసీపీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపిస్తే వారంతా అసెంబ్లీకి రాకుండా ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ మండిపడ్డారు.
సెప్టెంబర్ 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల ప్రారంభంకానున్నాయని చెప్పారు. ఈ సమావేశాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ ఆకాంక్షించారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలను ప్రస్తావించాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా ఆయన సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చంద్రబాబు ది గ్రేట్.. సీబీఎన్ కు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న అభినందనలు
250 కోట్ల మంది అకౌంట్లు ప్రమాదంలో.. జీమెయిల్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక..
For More AP News And Telugu News