Supreme Court Orders: డిప్యూటీ కలెక్టర్‌కు డిమోషన్.. సుప్రీం సంచలన తీర్పు
ABN , Publish Date - May 09 , 2025 | 02:05 PM
Supreme Court: కోర్టు ఆదేశాలను ధిక్కరించిన అధికారి పట్ల సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తాము చట్టానికి అతీతులమన్న భావనను ప్రభుత్వ అధికారులు తగ్గించుకోవాలని విచారణ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యలు చేసింది.

న్యూఢిల్లీ, మే 9: ఏపీ హైకోర్టు (AP High Court) ఆదేశాలను ఉల్లంఘించిన డిప్యూటీ కలెక్టర్ విషయంలో సుప్రీం కోర్టు (Supreme Court) సంచలన తీర్పు ఇచ్చింది. డిప్యూటీ కలెక్టర్‌ను ఎమ్మార్వోగా డిమోషన్ చేస్తూ సుప్రీం తీర్పునిచ్చింది. డిప్యూటీ కలెక్టర్ పిటిషన్‌పై విచారణ సందర్బంగా సుప్రీం ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తాము చట్టానికి అతీతులమన్న భావనను ప్రభుత్వ అధికారులు తగ్గించుకోవాలని వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు అమరావతి, విజయవాడ , తీహార్.. ఏ జైలుకు వెళ్లాలో డిప్యూటీ కలెక్టరే నిర్ణయించుకోవాలని సూచించింది. ఉద్దేశపూర్వకంగా ఉత్తర్వులను పాటించకపోవడంతో డిప్యూటీ కలెక్టర్‌కు ఏపీ హైకోర్టు రెండు నెలల జైలుశిక్ష విధించింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేశారు డిప్యూటీ కలెక్టర్. ఈ పిటేషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
2013 డిసెంబర్ 11న గుంటూరులో ఒక ప్రాంతంలో ఆక్రమణలను తొలగించవద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను డిప్యూటీ కలెక్టర్ ధిక్కరించారు. అప్పట్లో తహసీల్దార్‌గా ఉన్న సదరు అధికారి హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి 2014లో ఆక్రమణలు తొలగించారు. దీంతో ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందిన సదరు తహసీల్దార్‌కు ఏపీ హైకోర్టు రెండు నెలల జైలు శిక్ష విధించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ డిప్యూటీ కలెక్టర్ సుప్రీంను ఆశ్రయించిగా... గత సోమవారం విచారణ జరిపింది ధర్మాసనం. విచారణలో డిప్యూటీ కలెక్టర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు జస్టిస్ బీఆర్ గవాయ్.
Vikram Doraiswami: పాక్ బండారం బయటపెట్టిన భారత్.. మొహం ఎక్కడ పెట్టుకుంటారో..
‘అధికారులు తాము చట్టానికి అతీతులమన్న భావన కలిగి ఉండకూడదు. ఒకసారి కోర్టు హెచ్చరించింది. అయినా తిరిగి అదే చర్య చేశాడు. అతన్ని ఎలా క్షమించాలి. అతను తను హైకోర్టు కన్నా పెద్దవాడని అనుకుంటున్నాడా. ఎన్ని కుటుంబాలను ఖాళీ చేయించారు.. 80 మంది పోలీసులతో వెళ్లి హైకోర్టు ఆదేశాల్ని విస్మరించారు. అతను 48 గంటలు కస్టడీలో ఉంటే ఉద్యోగం పోతుంది’ అంటూ డిప్యూటీ కలెక్టర్‌పై మండిపడ్డ జస్టిస్ గవాయ్.. ప్రతి అధికారికి హైకోర్టు ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత ఉందని తెలుసుకోవాలని స్పష్టం చేశారు.
అయితే డిప్యూటీ కలెక్టర్‌కు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే జోక్యం చేసుకున్న న్యాయమూర్తి గవాయ్... అతను ఎన్నో కుటుంబాలను ఖాళీ చేయించారని, వారి పిల్లలు ఏమవుతారు అంటూ మండిపడ్డారు. సాధారణ పరిస్థితుల్లో పిటిషన్ తీసుకోవడం సరికాదని.. అయినా తాము కొంత సహనాన్ని పాటిస్తూ నోటీసు జారీ చేస్తున్నామని తెలిపింది. మే 5 వరకు హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు న్యాయవాది అవసరం లేదని, సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం లభిస్తుందని ధర్మాసనం తెలిపింది. డిప్యూటీ కలెక్టర్ కొంతకాలం ప్రభుత్వ అతిథిగా ఉండాలని జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. ‘డిప్యూటీ కలెక్టర్ మళ్లీ తహసీల్దార్‌గా లేదా పట్వారిగా పంపితే సరిపోతుంది’ అని కూడా గతంలో సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: జవాన్ మురళీ నాయక్‌కు సీఎం చంద్రబాబు, లోకేష్ నివాళులు
Karachi Port Missile Strike: పాక్‌కు చావుదెబ్బ
Read Latest AP News And Telugu News