Karachi Port Missile Strike: పాక్‌కు చావుదెబ్బ
ABN , Publish Date - May 09 , 2025 | 03:07 AM
భారత నావికా దళం కరాచీ, ఓమ్రారా పోర్టులపై బ్రహ్మోస్ క్షిపణులతో ఘాటు దాడి చేసింది. పాకిస్థాన్‌కు చెందిన 10-12 నౌకలు ధ్వంసమవడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

కరాచీ, ఓమ్రారా పోర్టులపై భారత్ భీకర దాడి.. రంగంలోకి ఐఎన్‌ఎస్ విక్రాంత్
దాని వెంట 26 యుద్ధ నౌకలు.. బ్రహ్మోస్ క్షిపణులతో మెరుపుదాడులు?
పాక్‌కు చెందిన 10-12 నౌకలు ధ్వంసం.. 1971 పునరావృతం?
గోడ దెబ్బ.. చెంప దెబ్బ.. ఒకేసారి గట్టిగా.. ఘాటుగా తగిలితే! పాకిస్థాన్ పరిస్థితి ఇప్పుడు ఇదే! పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలనే భారత సైన్యం ధ్వంసం చేసింది! పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగానే దాడులు చేశామని స్పష్టం చేసింది! అయినా.. పాకిస్థాన్ కయ్యానికి సై అంది! సమరానికే సిద్ధమంది! యధేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతూ.. మన సైనిక స్థావరాలు, పౌర ఆవాసాలపై గురి పెట్టింది! బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచే.. భారత్‌లోని 15 నగరాల్లోని సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడికి విఫల యత్నం చేసింది! ఆ దాడులను మన ‘సుదర్శన చక్రం’ (ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్) తుత్తునియలు చేసింది! ప్రతిగా.. లాహోర్ సహా పాకిస్థాన్‌కు చెందిన తొమ్మిది ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై భారత్ భీకర దాడులు చేసింది. దాంతో, మరింత రెచ్చిపోయిన పాకిస్థాన్.. డ్రోన్లు, రాకెట్ల వర్షం కురిపిస్తోంది! భారత్ వాటన్నిటినీ గాల్లోనే అడ్డుకుని ధ్వంసం చేస్తోంది! వెరసి, సరిహద్దు గ్రామాల్లో ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది! దీంతో, అటు పాకిస్థాన్, ఇటు భారత్‌తో అమెరికా సంప్రదింపులు జరిపింది. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించింది! ఆ చర్చలు విఫలమైన మరు క్షణంలోనే పాకిస్థాన్‌కు చావు దెబ్బ తప్పలేదు! అటు క్వెట్టాను బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. దాంతో, అక్కడి నుంచి పాక్ ఆర్మీ పలాయనం చిత్తగిస్తోంది! ఆ వెంటనే.. కరాచీ పోర్టుపై భారత నావికా దళం భీకర దాడి చేసింది! అరేబియా సముద్రంలో ఉన్న ఐఎన్‌ఎ్‌స విక్రాంత్ గ్రూపు నుంచి బ్రహ్మోస్ క్షిపణుల వర్షం కురిపించింది! ఇరు దేశాల మధ్య ఇక.. సమరమే!!
న్యూఢిల్లీ, మే 8: యుద్ధం మొదలైంది! పాకిస్థాన్ వాణిజ్యానికి అత్యంత కీలకమైన కరాచీ పోర్టుపై భారత నావికా దళం భీకర దాడి చేసింది.
అరేబియా సముద్రంలోని ఐఎఫ్ఎస్ విక్రాంత్ బ్యాటిల్ గ్రూప్ నుంచి బ్రహ్మోస్ క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దెబ్బకు పోర్టు మంటల్లో చిక్కుకుంది. అక్కడి 10-12 భారీ నౌకలు ధ్వంసమయ్యాయి. 1971 తర్వాత కరాచీ పోర్టుపై భారత్ దాడి చేయడం ఇదే తొలిసారి. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వార్తా కథనాలు వెలువడ్డాయి. దీనికి సంబంధించి అటు పాక్, ఇటు భారత సైనిక వర్గాల నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కానీ, నావికా దళంలోని ఉన్నతస్థాయి వర్గాలను ఉటంకిస్తూ పలు టీవీ చానళ్లు, వెబ్‌సైట్లు కథనాలను ప్రసారం చేశాయి. అలాగే, పాకిస్థాన్‌లోని కీలక నావికా స్థావరాలపైనా భారతీయ నావికా దళం దాడులు చేసినట్లు సమాచారం. ఓవైపు.. అత్యంత కచ్చితత్వంతో ఉగ్ర స్థావరాలపై దాడులు చేసిన భారతీయ వైమానిక దళం.. ఆ తర్వాత పాకిస్థాన్ రాకెట్, డ్రోన్ దాడులనూ సమర్థంగా అడ్డుకుంటోంది. తాజాగా, భారత నావికా దళం కూడా రంగంలోకి దిగింది. అరేబియా సముద్రంలో ఉన్నఐఎఫ్ఎస్ విక్రాంత్ నుంచి క్షిపణి దాడులకు శ్రీకారం చుట్టింది. పాక్ కీలక నేవీ స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించింది.
భారీ విధ్వంసం సృష్టించింది. ఫలితంగా, పాకిస్థాన్ తీర ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. రక్షణ శాఖ వర్గాల కథనం ప్రకారం.. అరేబియా సముద్రంలోఐఎఫ్ఎస్‌విక్రాంత్‌తోపాటు 26 భారతీయ యుద్ధ నౌకలు ఉన్నాయి. గురువారం అర్ధరాత్రి సమయంలో కరాచీ, ఓమ్రారా పోర్టులపైఐఎఫ్ఎస్ విక్రాంత్ క్షిపణుల వర్షం కురిపించింది. ఆ సమయంలో కరాచీ నగరమంతా ఆకాశంలో నల్లగా పొగ కమ్మేసింది. పోర్టులో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. పది నుంచి 12 నౌకలు పూర్తిస్థాయిలో ధ్వంసమైనట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. కరాచీ పోర్టులోని కీలక ప్రాంతాలు కూడా మంటల్లో అంటుకున్నాయని, దాంతో, స్థానికులు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారని వివరించాయి. దాడుల్లో రెండు పోర్టులు తీవ్ర స్థాయిలో ధ్వంసమయ్యాయని, పాకిస్థాన్ రక్షణ సామర్థ్యాన్ని ఇది తీవ్రంగా దెబ్బతీస్తుందని స్థానిక వర్గాలు తెలిపాయి. అదే సమయంలో.. ఇదే అదనుగా స్వతంత్ర దేశాన్ని కోరుతున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ రంగంలోకి దిగింది. పాకిస్థాన్‌లోని క్వెట్టాపై విరుచుకుపడింది. అక్కడి పాకిస్థాన్ ఆర్మీ స్థావరాలపై బలూచ్ దళాలు వరుస దాడులు చేశాయి. ఈ క్వెట్టా నగరం బలూచిస్థాన్‌కు రాజధాని కూడా కావడం విశేషం. వరుస పేలుళ్లతోపాటు కొద్ది సమయంపాటు ఇరు వర్గాల మధ్య కాల్పులు కూడా చోటుచేసుకున్నాయి. అనంతరం, క్వెట్టా నగరాన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. ఫలితంగా.. అక్కడి పాక్ ఆర్మీ క్వెట్టా నుంచి పలాయనం చిత్తగిస్తోందని బలూచ్ వర్గాలు తెలిపాయి. ఇదే జరిగితే.. పాకిస్థాన్ మరోసారి మళ్లీ రెండు ముక్కలు అయ్యేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది.