AP Revenue Department Review: టెక్నాలజీతో రెవెన్యూశాఖలో సమూల మార్పులు: మంత్రి అనగాని
ABN , Publish Date - Jul 04 , 2025 | 05:03 PM
AP Revenue Department Review: నాలుగు లక్షల 63 వేల గ్రీవెన్స్‌లు వస్తే దానిలో 3 లక్షల 90 వేలకు పైగా పరిష్కరించామన్నారు. అభ్యంతరం లేని భూములు విషయంలో జీవో 30 ద్వారా చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

అమరావతి, జులై 4: రెవెన్యూ సంబంధించి పది అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సమీక్ష చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satyaprasad) తెలిపారు. నేడు (శుక్రవారం) ఏడాది కాలంగా రెవెన్యూ శాఖ పనితీరుపై సీఎం సమీక్ష చేశారు. సమావేశం అనంతరం మంత్రి అనగాని మీడియాతో మాట్లాడుతూ.. పది లక్షల రూపాయలు వరకూ భూమి విలువ ఉంటే సక్సెన్ సర్టిఫికెట్ కోసం గ్రామ సచివాలయంలోనే 100 రూపాయలు ఫీజు చెల్లించి పొందవచ్చన్నారు. 10 లక్షలపైన విలువ ఉంటే వెయ్యి రూపాయలు ఫీజుగా నిర్ణయించినట్లు తెలిపారు. సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హమీలన్నీ అమలు చేస్తున్నామన్నారు. శ్మశానాలకు స్థలాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. హౌసింగ్ ఫర్ ఆల్‌లో భాగంగా ప్రతీ పేదవాడికి నివాస యోగ్యం అయిన ఇళ్లు ఉండాలని నిర్ణయించామని.. రెండు సంవత్సరాల్లో ఇంటి స్థలం.. మూడు సంవత్సరాల్లో ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
జర్నలిస్టు హౌసింగ్‌కు పేదల హౌసింగ్‌కు ముగ్గురు మంత్రులతో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని.. మంత్రి వర్గ ఉపసంఘంలో రెవెన్యూ, మున్సిపల్, గృహ నిర్మాణ శాఖామంత్రులు ఉంటారని మంత్రి అనగాని తెలిపారు. ప్రీహోల్డ్ భూముల విషయంలో పది అంశాలు పరిగణలోకి తీసుకొని జీవోఎం అనేక మీటింగ్‌లు తీసుకున్నామని.. అక్టోబర్ 2 నాటికి ఈ అంశంపై కచ్చితమైన నిర్ణయం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. నాలుగు లక్షల 63 వేల గ్రీవెన్స్‌లు వస్తే దానిలో 3 లక్షల 90 వేలకు పైగా పరిష్కరించామన్నారు. అభ్యంతరం లేని భూములు విషయంలో జీవో 30 ద్వారా చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రెవెన్యూ సదస్సులో తీసుకున్న అర్జీలకు చాలా వరకూ పరిష్కరించామని వెల్లడించారు. గత పాలకులు రెవెన్యూ వ్యవస్థను ఒక ఆర్థిక వనరుగా చూశారని విమర్శించారు. మద్యం తరహాలోనే ఇక్కడి నుంచి వారు, వారు అనునాయులు బాగుపడేలా చేసుకున్నారని మండిపడ్డారు.
టెక్నాలజీ ద్వారా రెవెన్యూశాఖలో సమూల మార్పులకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం రీ సర్వే చేయకుండానే ఫోటోల పిచ్చితో ఇష్టానుసారం చేశారని ఫైర్ అయ్యారు. 200-250 ఎకరాలకు మించకుండా బ్లాక్ సిష్టం పెట్టి చేశారన్నారు. రీసర్వేపై ప్రతీ మూడు నెలలకు ఒకసారి రివ్యూ చేస్తామన్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చే పాస్ బుక్ క్యూ ఆర్ కోడ్ అనేది భూమి జీపీఎస్ కూడా చూపుతుందని పేర్కొన్నారు. ఆగష్టు 15న పండగ వాతావరణంలో అందరికీ పాస్ పుస్తకాలు అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ప్రైవేటు భూములకు వేర్వేరు రంగులతో మ్యాప్‌లు సిద్ధం చేస్తున్నారని.. అధికారులు ప్రోటోకాల్‌పై ఉండిపోవడంతో అన్ని ఇబ్బందులు వస్తున్నాయన్నారు. మంత్రులు ఎవరు వెళ్లినా ప్రోటోకాల్ రెవెన్యూ శాఖ పర్యవేక్షణలో ఆయా డిపార్టమెంట్ అధికారులే చూస్తారన్నారు.
ఈనెల 9న జరగబోయే కేబినెట్ సమావేశంలో నాలా రద్దు విషయంలో చర్యలు తీసుకుంటామని.. లేని పక్షంలో ఆ తరువాత కేబినెట్‌లో అయినా తెస్తామన్నారు. సర్వే, రిజిష్ట్రేషన్, రెవెన్యూలో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ తీసుకువచ్చి తప్పుడు రిజిష్ట్రేషన్లు జరగకుండా చూస్తామని పేర్కొన్నారు. దీన్ని వచ్చే కేబినెట్‌లో తీసుకువచ్చి అమలులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈరోజు డిపార్టమెంట్‌లో పోస్టుల గురించి మాట్లాడామన్నారు. అన్ని విషయాలపై చర్చించామన్నారు. సర్వేయర్లను రేషనలైజేషన్ చేస్తున్నారని... అయితే రీసర్వే జరిగే చోట సర్వేయర్లను మార్చేది లేదని తేల్చిచెప్పారు.
‘మేము క్వూఆర్ కోడ్‌తో పాస్ పుస్తాకాలే కాదు ఆధార్‌తో కూడా కలుపుతున్నాం. తెలంగాణలో ధరణి పోర్టల్‌కు ఇక్కడ రెవెన్యూ పని తీరుకు చాలా తేడా ఉంది. మేము ఏం చేసినా పారదర్శకంగా చేస్తున్నాం. అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద జీవో నెంబర్ 84 ప్రకారం 50 శాతం ఫీజు కట్టారు. రెండేళ్లుగా రెగ్యూలరైజ్ చేసేందుకు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి కేసులు విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖలలో 354 ఉన్నాయి. వాటిపై ఈ నెల 9న జరిగే జీవోఎంలో చర్చించి ముందుకు వెళతాం. పరిష్కారం చూపి న్యాయం చేసేస్తాం’ అని మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
స్కూల్ విద్యార్థులకు తప్పిన భారీ ప్రమాదం
అల్లూరి, పింగళి వెంకయ్య, స్వామి వివేకానందకు మంత్రి లోకేష్ ఘన నివాళి
Read latest AP News And Telugu News