School Bus Incident: స్కూల్ విద్యార్థులకు తప్పిన భారీ ప్రమాదం
ABN , Publish Date - Jul 04 , 2025 | 04:09 PM
School Bus Incident: కేసీపీ క్వార్టర్స్ నుంచి విద్యార్థులను పాఠశాలల్లో దింపేందుకు కంపెనీ వాహనం క్వార్టర్స్ వద్దకు వెళ్లింది. పిల్లలు అందరూ ఎక్కిన తర్వాత బస్సు బయలుదేరింది. ఆ తరువాత బజాజ్ షోరూం సమీపంలో వాహనాన్ని ఆపి స్కూల్లోకి పిల్లలను పంపించేందుకు కంపెనీ బస్సు నుంచి డ్రైవర్, క్లీనర్ కిందకు దిగారు.

కృష్ణా జిల్లా, జులై 4: జిల్లాలోని జగ్గయ్యపేటలో (Jaggayyapeta) స్కూల్ విద్యార్థులకు భారీ ప్రమాదం తప్పింది. ప్రతీ రోజులాగే ఈరోజు కూడా విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు బస్సు ఎక్కారు. స్కూల్ వద్దకు వాహనం చేరుకున్న వెంటనే వారంతా ఒకరి తరువాత ఒకరు దిగి లోపలికి వెళ్తున్నారు. ఇదే సమయంలో జరిగిన ఓ ఘటన అక్కడి వారిని భయాందోళనకు గురిచేసింది. అయితే వాహనం డ్రైవర్, క్లీనర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పిల్లలకు పెను ప్రమాదం తప్పినట్లైంది. చిన్నారులంతా క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇంతకీ ఏం జరిగింది.. ఎలాంటి ప్రమాదం తప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈరోజు (శుక్రవారం) ఉదయం కేసీపీ క్వార్టర్స్ నుంచి విద్యార్థులను పాఠశాలల్లో దింపేందుకు కంపెనీ వాహనం క్వార్టర్స్ వద్దకు వెళ్లింది. పిల్లలు అందరూ ఎక్కిన తర్వాత బస్సు బయలుదేరింది. ఆ తరువాత బజాజ్ షోరూం సమీపంలో వాహనాన్ని ఆపి స్కూల్లోకి పిల్లలను పంపించేందుకు బస్సు నుంచి డ్రైవర్, క్లీనర్ కిందకు దిగారు. అయితే వారు రోడ్డు క్రాస్ చేసి వస్తున్న సమయంలో కోదాడ రోడ్డు వైపు నుంచి ఓ ప్రైవేటు స్కూల్ బస్సు అతివేగంగా దూసుకొచ్చింది. తన బస్సుకు బ్రేక్ ఫెయిల్ అయ్యిందంటూ డ్రైవర్ గట్టి గట్టిగా అరిచాడు.
పిల్లల మీదకు రాబోతున్న బస్సును వెంటనే గమనించిన డ్రైవర్, క్లీనర్ సమయస్ఫూర్తితో చిన్నారులను అక్కడి నుంచి తప్పించేశారు. దీంతో పిల్లలంతా క్షేమంగా బయటపడ్డారు. డ్రైవరు, క్లీనర్ గమనించకపోతే బస్సు దూసుకొచ్చి పిల్లలపైకి వెళ్లలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో 15 నుంచి 20 మంది పిల్లలు రోడ్డు దాటుతున్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్‌ను ఎస్సై రాజు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
అల్లూరి, పింగళి వెంకయ్య, స్వామి వివేకానందకు మంత్రి లోకేష్ ఘన నివాళి
జగన్నాథ స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన హోంమంత్రి
Read latest AP News And Telugu News